మెగాస్టార్ చిరంజీవి తొలిసారి బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వనున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' (ఎమ్ఈకె)కు 'పెద్ద' నోటు దెబ్బ పడిందా? షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ లో ప్రసారం కావాల్సిన ఈ ప్రోగ్రామ్ వాయిదా పడే సూచనలు ఉన్నయా? ఈ అనుమానం మీడియాలో కలుగుతోంది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం మీడియాపై తీవ్రంగా ఉందనే విషయం తెలిసిందే. ఈ కారణంగానే కొన్ని మీడియా సంస్థలు ప్రధాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వార్తాకథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఈ ప్రభావం టీవీ లైవ్ షోలపై కూడా పడిందని అంటున్నారు. ఈ క్రమంలో చిరంజీవి నిర్వహణలో 'ఎమ్ఈకె' ప్రసారంపై కనిపిస్తోంది. కొద్ది నెలల క్రితం చేసిన 'ఎమ్ఈకె' హడావుడి తగ్గింది. కొద్ది రోజుల వాయిదా వేసి, ఆ తర్వాతే ప్రసారం చేస్తారనే మాట వినిపిస్తోంది.
'మా' టీవీలో ఉన్న చిరంజీవి, నిమ్మగడ్డ ప్రసాద్, నాగార్జున తమ షేర్స్ ను గత ఏడాది 'స్టార్ నెట్ వర్క్' కు అమ్మిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 'స్టార్ నెట్ వర్క్' ఆధ్వర్యంలోనే 'మా' టీవీ నడుస్తోంది. ప్రస్తుతం మాదాపూర్ లో ఉన్న 'మా' టీవీ కార్యాలయాన్ని బంజారాహిల్స్ కు మారుస్తున్నారు. నోటు ప్రభావం 'స్టార్ నెట్ వర్క్' లావాదేవీలపై పడిందని అంటున్నారు. ఈ క్రమంలో 'ఎమ్ఈకె'లో ప్రతి ఎపిసోడ్ లో గెలుపొందినవారికి చెక్ రూపంలో వైట్ మని చెల్లించాలి. అలాగే వీటి నిర్వహణకు అంటే పార్టిసిపెంట్స్ ను పిలిపించడం, వారికి అకామిడేషన్, ట్రాన్స్ పోర్ట్ ఖర్చులను కూడా సంస్థ భరించాల్సి ఉంటుంది. వీటి నిర్వహణ ఖర్చు తడిసిమోపడవుతుంది. అలాగే ప్రస్తుతం కార్పోరేట్ రంగం పెద్ద నోటు కారణంగా కుదేలైంది. దాంతో స్పాన్సర్స్ బడ్జెట్ కోత విధించుకున్నారు. ఇలా అనేక కారణాల నేపథ్యంలో 'ఎమ్ఈకె' ప్రసారం వాయిదా పడే సూచనలున్నాయని మీడియాలో ప్రచారం జరుగుతోంది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'ఖైదీ నంబర్ 150' చిత్రం మరో 45 రోజుల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. దీనికంటే ముందే 'ఎమ్ఈకె' ప్రసారాలు జరిగితే ప్రజల్లో చిరంజీవి ఇమేజ్ పెరుగుతుందని భావించారు. నాగార్జున ఫామ్ లోకి రావడానికి ఇదే ఫార్ములా ఉపయోగపడినట్టుగానే చిరంజీవికి సైతం వర్కవుట్ అవుతుందని భావించిన నేపథ్యంలో 'ఎమ్ఈకె' ప్రసారాలు ఎట్టి పరిస్థితుల్లో షెడ్యూల్ ప్రకారం మెుదలుపెట్టే ప్రయత్నాలను'మా' టీవీ చేస్తున్నట్టు తెలిసింది. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.