సినిమా హిట్ అంటారు. దిన పత్రికల్లో అరపేజీ ప్రకటనలిస్తారు. మరోవైపు పొడుగు ఎక్కువైందని పావుగంట సినిమా కట్ చేస్తారు. ఇలా రకరకాలుగా 'జయమ్మునిశ్చయమ్మురా' చిత్రానికి జరుగుతోంది. రిలీజ్ కు రెండు రోజుల ముందే ప్రీమియర్ షో వేసి దర్శక, నిర్మాతలు సినిమా విజయంపై తమకున్న నమ్మకాన్ని తెలియజేశారు. ఆర్థిక స్లంప్ లో ధైర్యంగా విడుదల చేశారు. సినిమాకు హిట్ టాక్ వచ్చిందని ప్రచారం చేస్తున్నారు. అయితే లెక్కల్లో మాత్రం తేడా కనిపిస్తోందట. హిట్ సినిమా అని చెప్పుకుంటున్నారు కానీ, థియేటర్లలో కాసుల గలగల మాత్రం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. బాగున్న సినిమాకు కూడా డబ్బులు రాకపోతే ఎలా? అని తలపట్టుకుంటున్నారు.
శ్రీనివాసరెడ్డి అనే సాధారణ కమేడియన్ ను హీరో గా పెట్టి ధైర్యంగానే సినిమా తీశారు. 'దేశవాళి వినోదం' అంటు సరికొత్త ట్యాగ్ లైన్ ఇచ్చి ఆకట్టుకున్నారు. ప్రచారానికి కొదవ లేదు. అయిప్పటికీ థియేటర్లు నిండకపోవడానికి 'చిల్లర' కష్టాలే కారణమా? అనే అనుమానం తలెత్తుతోంది. అయితే 'జయమ్మునిశ్చయమ్మురా' సినిమాపై చిత్ర పరిశ్రమలో ఉన్న ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించడంలో దర్శక, నిర్మాతలు విఫలమయ్యారనేది వాస్తవం. దాంతో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గానే మిగిలిపోయే ప్రమాదం వచ్చింది. పబ్లిక్ లో హిట్ కావాలంటే అండర్ ప్రొడక్షన్ లోనే ఆసక్తి కలిగించాలి. ఈ విషయాన్ని యూనిట్ మరిచింది.