నిన్నమొన్నటివరకు సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్, తమన్‌ల మధ్య టాలీవుడ్‌లో నువ్వా? నేనా? అన్నట్లుగా పోటీ నడిచింది. దేవిశ్రీ వంటి మినిమం గ్యారంటీ సంగీత దర్శకుడు కాకపోయినా తాను కూడా పోటీలో నిలిచి, పలు పెద్ద పెద్ద హీరోల చిత్రాలకు సంగీతం అందిస్తూ, అతి తక్కువ కాలంలోనే తమన్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారాడు. వీరిద్దరి మధ్య పోటీ తెలుగులోనే కాదు తమిళంలో సైతం సాగింది. కానీ ఇటీవలి కాలంలో మాత్రం దేవిశ్రీ మరలా ఏకచ్చత్రాధిపత్యం తిప్పుతున్నాడు. తమన్ వెనకపడ్డాడు. కానీ ఇప్పుడు తమన్ మరలా కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్‌లతో బిఙీగా మారుతున్నాడు. అనుష్క ప్రధానపాత్రలో పిల్లజమీందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న 'భాగమతి'కి ఆయన సంగీతం అందిస్తున్నాడు. ఇక తాజాగా నాగార్జున హీరోగా పివిపి బేనర్‌లో ఓంకార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాజుగారి గది2' కూడా సంగీత దర్శకునిగా అవకాశం సంపాదించాడు. ఇక 'దూకుడు, బిజినెస్‌మెన్, ఆగడు' వంటి మ్యూజికల్ హిట్ చిత్రాల తర్వాత త్వరలో మరోసారి సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించబోయే ఓ చిత్రానికి సంగీత దర్శకునిగా ఎంపికయ్యాడు. అయితే ఈ చిత్రం ఎవరి దర్శకత్వంలో రూపొందే చిత్రం అనేది సస్పెన్స్‌గా ఉంది. మహేష్ ప్రస్తుతం మూడు చిత్రాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రానికి హరీష్‌జైరాజ్ సంగీతం అందిస్తుండగా, తర్వాత చేయబోయే కొరటాల చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఆ తర్వాత ఆయన పివిపి బేనర్‌లో వంశీపైడిపల్లి దర్శకత్వంలో నటించే చిత్రానికి 'ఊపిరి' సంగీత దర్శకుడు గోపీసుందర్ మ్యూజిక్ అందించనున్నాడని వార్తలు వచ్చాయి. కాగా ఈ చిత్రానికి గోపీసుందర్ పనిచేయడం లేదని, మహేష్ రికమండేషన్‌తో ఆ చాన్స్ తమన్‌కు ఇప్పించాడని కొందరు అంటుండగా, కాదు... వంశీపైడిపల్లి చిత్రానికి గోపీసుందరే సంగీతం అందిస్తాడు. ఆ తర్వాత మహేష్ పూరీ దర్శకత్వంలో చేయబోయే చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడని మరికొందరి వాదన, తాను త్వరలో మహేష్ చిత్రానికి సంగీతం అందించనున్నానని తమన్ చెప్పడంతో ఈ చర్చ మరింత ఊపందుకుంది. మొత్తానికి మరలా తమన్ పోటీలోకి వస్తున్నాడు. ఈ చిత్రాలతో పాటు ఆయనకు మూడు తమిళ చిత్రాలలో కూడా సంగీత దర్శకునిగా అవకాశాలు వచ్చాయని తెలుస్తోంది.