తమిళ, తెలుగు చిత్రాలలో మాస్ హీరోగా మంచి పేరున్న విశాల్ తన తాజా చిత్రం 'కత్తిసందై'ని ఈనెల రెండోవారంలోనే తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని భావించాడు. కానీ పెద్దనోట్ల రద్దుతో ఏర్పడిన ఇబ్బందుల కారణంగా ఈచిత్రం పోస్ట్‌పోన్ అయింది. కాగా ఈ చిత్రాన్ని పొంగల్ బరిలోకి దించాలని విశాల్ భావిస్తున్నాడు. కాగా వచ్చే పొంగల్‌కు తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'భైరవ' చిత్రం కూడా రిలీజ్ కానుంది. ఇలా అనుకోకుండా పొంగల్ బరిలోకి దిగాలని చూస్తున్న విశాల్‌కు తమిళనాట విజయ్ రూపంలో గట్టిపోటీ ఎదురుకానుంది. కాగా విశాల్ సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న 'కత్తిసండై' చిత్రం తెలుగులో 'ఒక్కడొచ్చాడు' పేరుతో విడుదల కానుంది. మరోపక్క విజయ్ నటిస్తున్న 'భైరవ' చిత్రంలో సెన్సేషనల్ హీరోయిన్ కీర్తిసురేష్ నటిస్తుండగా, ప్రధాన విలన్ పాత్రను జగపతిబాబు పోషిస్తుండటం విశేషం. దీంతో ఈ చిత్రాన్ని కూడా తెలుగులో డబ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఇక గతంలో పొంగల్ రేసులో విజయ్, విశాల్‌కు కొన్నేళ్ల కిందట పోటీ ఎదురైంది. విజయ్ నటించిన 'పోకిరి', విశాల్ నటించిన 'భరణి' చిత్రాలు బరిలో నిలవగా రెండు చిత్రాలు మంచి విజయాన్ని సాధించడం విశేషం. ఇక విజయ్, విశాల్‌లు ఒకే కాలేజీలో కలిసి చదివారు. ఒకరు సీనియర్ కాగా, మరొకరు జూనియర్. వీరిద్దరు చెన్నైలోని లయోలా కాలేజీలోనే చదివారు. మొత్తానికి ఈ రెండు చిత్రాలకు హీరోయిన్ల రూపంలో కూడా మంచి క్రేజ్ ఉన్న వారు నటిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. మరి ఈసారి పొంగల్ పోటీలో కూడా ఇరువురు విజేతలుగా నిలవాలని ఇద్దరు హీరోల అభిమానులు కోరుకుంటున్నారు.