ఈమధ్య సంగతి పక్కనపెడితే జూనియర్ ఎన్టీఆర్‌కు గర్వం ఎక్కువని, తన చుట్టూ ఉన్న భజనరాయుళ్ల వల్లే ఆయన నిర్ణయాలు ఆ రకంగా ఉంటాయనే ప్రచారం ఉంది. గతంలో ఎన్టీఆర్ ప్రవర్తనను గమనించిన వారు ఇది పచ్చినిజమేనని ఒప్పుకుంటారు. కాగా ఆయన చెప్పుడు మాటలు బాగా వింటాడనే విషయం మరోసారి రుజువైంది. ఎన్టీఆర్‌కు ఉన్న మంచి క్లోజ్ ఫ్రెండ్స్‌లో రాజీవ్ కనకాల, కమెడియన్ శ్రీనివాసరెడ్డి, సమీర్.. వంటి వారు ఉండేవారు. కానీ గత కొంతకాలంగా శ్రీనివాసరెడ్డిని ఎన్టీఆర్ దూరంగా పెడుతూ వస్తున్నాడు. వీరిద్దరి మద్య గ్యాప్ వచ్చి చాలా కాలమే అయింది. అయితే ఎందువల్ల ఎన్టీఆర్ ఇలా చేశాడు? అన్నది మాత్రం కొంత మందికే తెలుసు. కాగా గత వారం శ్రీనివాసరెడ్డి హీరోగా నవరసాలను పండిస్తూ, అండర్‌ప్లే నటనతో అదరగొట్టిన 'జయమ్ము నిశ్చయంబురా' చిత్రం విడుదలైంది. ఈ చిత్రం అద్భుతమైన టాక్‌తో నడుస్తోంది. కాగా ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా శ్రీనివాసరెడ్డి ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌తో విభేదాల గురించి చెప్పుకొచ్చాడు.
ఆయన మాటల్లోనే చెప్పాలంటే... ఎన్టీఆర్, నేను, రాజీవ్‌కనకాల ఎప్పటి నుంచో మంచి క్లోజ్ ఫ్రెండ్స్‌మి. మేమంతా కలిసి క్రికెట్ ఆడేవాళ్లం. కాగా 2009ఎన్నికల్లో ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం చేశారు. ఆయనతో పాటు రాజీవ్‌కనకాల, సమీర్, రఘు... వీళ్లంతా ఉన్నారు. కానీ నేను ఎన్టీఆర్‌తో ఖమ్మం మీటింగ్ నుంచి జాయిన్ అయ్యాను. ఈ మీటింగ్ అయిపోగానే ఎన్టీఆర్‌తో పాటు మరికొంతమంది స్నేహితులు ముందు కారులో, నేను వెనక కారులో హైదరాబాద్ బయలుదేరాం. అప్పుడే ఎన్టీఆర్‌కి కారు యాక్సిడెంట్ అయింది. మేము వెనుక కారులో నుంచి దిగి ఎన్టీఆర్ కారులో ఆయన కోసం వెతికాం. తీరా చూస్తే ఎన్టీఆర్ గుర్తుపట్టలేని విధంగా గుడ్డలు చినిగిపోయి, డెబ్బలతో బయట నేలపై కూర్చొని ఉండటం గమనించాను. ఆయన చుట్టూ కొంతమంది ఉన్నారు. నేను ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి చూస్తే యాక్సిడెంట్‌లో తగిలిన దెబ్బలు, తలకు అయిన గాయం వల్ల రక్తం కారుతోంది. దాంతో నేను వెంటనే నా దగ్గర ఉన్న గుడ్డతో కట్టుకట్టాను. యాక్సిడెంట్ ప్రాంతానికి దగ్గరగా ఉన్న సూర్యాపేటలో మా పెద్దక్క ఉంటుంది. ఆమెకు ఫోన్ చేసి అక్కడ ఏది మంచి హాస్పిటలో కనుక్కున్నాను. వెంటనే నా కారులో ఎక్కించుకొని సూర్యాపేటలోని ఓ హాస్పిటల్‌లో చేర్పించి ఫస్ట్‌ఎయిడ్‌తో పాటు గాయాలకు కుట్లు వేయించి, ఆ తర్వాత హైదరాబాద్‌లోని కిమ్స్‌లో చేర్పించాం. కాగా మా బ్యాచ్‌లో ఒకతను వెటకారంగా 'నువ్వు ఎంటర్ అయ్యావు... యాక్సిడెంట్ జరిగింది' అన్నాడు. నాకు బాధవేసి, నేను ఉండబట్టే ప్రాణాలు నిలబడ్డాయి.. అని సమాధానం ఇచ్చాను. కానీ ఎన్టీఆర్‌కు వారు ఏమేమో చెప్పారు. దాంతో ఎన్టీఆర్ నన్ను దూరంగా ఉంచడం మొదలుపెట్డాడు. చాలా ఏళ్లు ఇలాగే గడిచిపోయాయి. కానీ ఎన్టీఆర్‌ను సందర్బం వచ్చినప్పుడు కలసి, వాస్తవాలు చెప్పాలనుంది. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను.. అని బాధతో చెప్పుకొచ్చాడు.