సినిమా కథలో దమ్ముండి, కథ, కథనాలు ఆసక్తికరంగా, యూనివర్శల్ అప్పీల్‌గా ఉంటే దర్శకనిర్మాతలు, హీరోలు ఎవరనేది కూడా తెలియకపోయినా, భాష ఏదైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనేది పచ్చి వాస్తవం. కాగా తమిళంలో విజయ్‌ఆంటోని హీరోగా 'పిచ్చైకారన్'గా రూపొందిన చిత్రం అక్కడ ఘనవిజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ చిత్రం తెలుగు డబ్బింగ్‌గా విడుదలైన 'బిచ్చగాడు' తెలుగు సినీ చరిత్రలో ఒక గుర్తుండిపోయే చిత్రంగా నిలిచి, అనూహ్యవిజయం సాధించింది. కాగా ఇటీవల 'బిచ్చగాడు' చిత్రం బుల్లితెర ప్రీమియర్ షో టెలికాస్ట్ అయింది. బుల్లితెరపై కూడా ఈ చిత్రం స్టార్స్ నటించిన చిత్రాల కంటే ఎక్కువ టిఆర్పీ రేటింగ్‌లు సాధించింది. తాజాగా ఈ చిత్రం తమిళ వెర్షన్ 'పిచ్చైకారన్' చిత్రం కూడా తమిళ బుల్లితెరపై ప్రదర్శితమయింది. కాగా ఇప్పటివరకు దక్షిణాదిలో రాజమౌళి తీసిన ఎవర్‌గ్రీన్‌మూవీ 'బాహుబలి పార్ట్1' చిత్రం దక్షిణాదిలో అత్యధిక టిఆర్పీ రేటింగ్ సాధించి మొదటిస్దానంలో ఉంది. ఇప్పట్లో ఈ చిత్రం సాధించిన టీఆర్పీలను మరో చిత్రం చెరిపేయడం సాధ్యం కాదని చాలామంది భావించారు. కాగా తమిళ్‌లో కూడా హీరోగా పెద్దగా గుర్తింపులేని విజయ్‌ఆంటోని నటించిన లో బడ్జెట్ చిత్రం 'పిచ్చైకారన్'... ప్రపంచవ్యాప్తంగా భాషాభేదం లేకుండా దాదాపు 600కోట్లకు పైగా వసూళ్లను సాధించిన 'బాహుబలి-ది బిగినింగ్' రికార్డును బుల్లితెరపై చెరిపేసి, దక్షిణాదిలో ఏ చిత్రానికి సాధ్యంకాని టీఆర్పీని సాధించింది. ఇక ఈ చిత్రం టీఆర్పీని 'బాహుబలి-ది కన్‌క్లూజన్' లేదా '2.0'లలో దేనికో ఒకదానికే సాద్యమంటున్నారు.