Advertisementt

అన్న సెంటిమెంట్‌ తమ్ముడినేం చేస్తుందో..?

Sun 27th Nov 2016 03:23 PM
naga chaitanya,akhil,akhil second movie,sentiment,nagarjuna,ar rahman  అన్న సెంటిమెంట్‌ తమ్ముడినేం చేస్తుందో..?
అన్న సెంటిమెంట్‌ తమ్ముడినేం చేస్తుందో..?
Advertisement
Ads by CJ

దేశం గర్వించదగ్గ సంగీత దర్శకుల్లో ఏఆర్‌ రెహ్మాన్‌ ప్రముఖుడు. ఆయన తమ చిత్రాలకు సంగీతం అందించాలని అందరు దర్శకనిర్మాతలతో పాటు హీరోలు కూడా భావిస్తుంటారు. స్వరజ్ఞాని ఇళయరాజా తెరమరుగవుతున్న సమయంలో క్రియేటివ్‌ జీనియస్‌ మణిరత్నం.. పరిశ్రమకు సంగీత దర్శకునిగా రెహ్మాన్‌ ను పరిచయం చేసి ఆ లోటును తీర్చాడని చెప్పవచ్చు. కోలీవుడ్‌, బాలీవుడ్‌లలో రెహ్మాన్‌ సంగీతం అందించిన ప్రతి చిత్రం మ్యూజికల్‌ హిట్‌ ఆల్బమ్‌గా నిలవడమే కాదు.. వాటిల్లో పలుచిత్రాలు ఆయన అందించిన సంగీతం సహాయంతో మంచి విజయాలను కూడా సొంతం చేసుకున్నాయి. కానీ టాలీవుడ్‌లో మాత్రం ఆయన స్ట్రెయిట్‌గా సంగీతం అందించిన ఆడియోలే కాదు.... చిత్రాలు కూడా పెద్దగా సక్సెస్‌కాలేదు. దీనికి ఆయన సంగీతం అందించిన తెలుగు స్ట్రెయిట్‌ చిత్రాల దర్శకులు ఆయన నుండి సరిగ్గా అవుట్‌పుట్‌ తీసుకోలేకపోవడమే కారణమని చెప్పవచ్చు. కాగా అక్కినేని నట వారసుడు నాగచైతన్య, గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో నటించిన 'ఏ మాయా చేశావే' చిత్రం మాత్రం సంగీతపరంగా, సినిమాపరంగా పెద్ద హిట్‌గా నిలిచి చైతూకు మొదటి హిట్‌ను అందించింది. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ మరో అక్కినేని నటవారసుడు, నాగచైతన్య తమ్ముడు అఖిల్‌కు కూడా వర్కౌట్‌ అవుతుందా? లేదా? అనే అంశం ఆసక్తిని రేపుతోంది. 

తాజా వార్తల ప్రకారం అఖిల్‌ నటిస్తున్న రెండో చిత్రం నాగార్జున నిర్మాతగా 'మనం' ఫేమ్‌ విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో రూపొందనున్న సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 12న అధికారికంగా ముహూర్తం జరుపుకోనున్న ఈ చిత్రానికి సంగీత దర్శకునిగా రెహ్మాన్‌ను పెట్టుకున్నారనే వార్తలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అదే కనుక నిజమైతే ఈ చిత్రానికి మరింత క్రేజ్‌రావడం ఖాయమంటున్నారు. నాగచైతన్య నటించిన మొదటి చిత్రం 'జోష్‌' కూడా ఫ్లాప్‌ అయింది. కానీ రెహ్మాన్‌ సంగీతం అందించిన ఆయన ద్వితీయ చిత్రం 'ఏ మాయచేశావే' మాత్రం పెద్దహిట్‌గా నిలిచి ఆయనకు మొదటి హిట్‌ను అందించింది. అదే కోవలో అక్కినేని అఖిల్‌ నటించిన తొలిచిత్రం 'అఖిల్‌' కూడా డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఆయన రెండో చిత్రానికి రెహ్మాన్‌ సంగీతం అందిస్తే సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయి అఖిల్‌ కూడా మాయ చేస్తాడని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు. ఇక 'ఏమాయ చేశావే' చిత్రానికి రెహ్మాన్‌తో కలిసి పనిచేసిన అనుభవం ఉన్న గౌతమ్‌మీనన్‌ దర్శకత్వం వహించాడు. ఇక అఖిల్‌ రెండో చిత్రానికి దర్శకత్వం వహించనున్న విక్రమ్‌ కె.కుమార్‌కు సైతం రెహ్మాన్‌తో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. ఇటీవలే ఆయన తమిళ, తెలుగు భాషల్లో సూర్య హీరోగా చేసిన '24' చిత్రానికి రెహ్మానే సంగీతం అందించాడు. కాగా రెహ్మాన్‌తో మంచి ట్యూనింగ్‌ కుదరడంతో విక్రమ్‌ రెహ్మాన్‌ను పెట్టాలనే ప్రపోజల్‌ను పెట్టాడని, దానికి అఖిల్‌ మద్దతు కూడా తోడవ్వడంతో వారిద్దరు కలిసి నాగ్‌ను ఒప్పించారని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ