కొంతకాలం తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో సిద్దార్డ్‌కు ప్రస్తుతం టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు లేవు. కోలీవుడ్‌లో మాత్రం ఆమధ్య కొన్ని విజయవంతమైన సినిమాలు చేశాడు. ప్రస్తుతం సినిమాలలో ఫామ్ కోల్పోయిన సిద్దార్ద్ మాత్రం ప్రస్తుతం సామాజిక సేవలపై, సమాజంలో జరుగుతున్న సంఘటనలపై సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాడు. కొద్దికాలం కిందట వచ్చిన చెన్నై వరదల సమయంలో ఆయన సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకొని, ఆయన చేసిన సేవలకు ఆయనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. తాజాగా ఆయన ఓ అసభ్యకరమైన యాడ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేశాడు. జాక్ అండ్ జోన్స్ అనే దుస్తుల కంపెనీ ఇటీవల బాలీవుడ్ యువహీరో రణవీర్‌సింగ్‌తో ఓ యాడ్ చేయించింది. ఇందులో రణవీర్ తన భుజాలపై కురచ దుస్తులు వేసుకున్న ఓ మోడల్‌ను ఎత్తుకుంటూ కనిపిస్తాడు. ప్రచారంలో భాగంగా ఈ యాడ్ ని అన్ని చోట్ల హోర్డింగ్‌లుగా ఏర్పాటు చేసింది ఆ కంపెనీ. చెన్నైలో కూడా ఈ హోర్డింగ్‌లు దర్శనమిచ్చాయి. వీటిని చూసిన సిద్దార్ద్ మహిళలను గౌరవించి, పూజించే మన దేశంలో ఇలా మహిళలను కించపరిచే అసభ్యమైన ప్రచారాలపై సోషల్‌మీడియాలో స్పందించాడు. దానికి ఆయనకు నెటిజన్ల నుండి ఎంతో సపోర్ట్ లభించింది. దాంతో సదరు కంపెనీ ఆ యాడ్‌ను ఉపసంహరించుకొంది. తమకు ఎవ్వరినీ కించపరిచే ఉద్దేశ్యం లేదని, కాబట్టి సదరు ప్రకటనను ఉపసంహరించుకుంటున్నామని ఆ కంపెనీ ప్రకటించింది. ఈ విషయంలో సిద్దార్ద్ చొరవను ఇప్పుడు అందరూ ప్రశంసిస్తున్నారు.