ప్రధాని మోదీ తీసుకున్న కరెన్సీ మార్పిడిని అందరూ హర్షిస్తున్నప్పటికీ దీనివల్ల సామాన్య ప్రజలు బ్యాంకులు, ఎటీఎంల వద్ద పడుతున్నకష్టాలను, తగినంత కొత్తనోట్లు అందుబాటులో లేనందువల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యలపై మాత్రం విమర్శలు వస్తున్నాయి. తాజాగా పవన్‌కళ్యాణ్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా మోదీ నిర్ణయాన్ని రజనీ, కమల్, నాగార్జునలతో పాటు ఎంతోమంది సమర్ధిస్తూ స్పందిస్తున్నారు. తాజాగా మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కూడా ఈ నిర్ణయాన్ని మెచ్చుకున్నాడు. కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు తాత్కాలికంగా కొన్ని సమస్యలు ఏర్పడటం సహజమేనని, బ్రాందీ షాపులు, సినిమా థియేటర్లు, ప్రార్థనా మందిరాలలో క్యూలో నిలబడే ప్రజలు ఏటీఎంల వద్ద నిలబడటాన్ని భరించకపోతే ఎలా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కాగా ఆయన అలా స్పందిస్తున్న సమయంలోనే ఏటీఎంల వద్ద క్యూలో గంటల కొద్దీ నిరీక్షిస్తున్న ఇద్దరు కేరళలోనే మృతి చెందారు. దాంతో మోహన్‌లాల్ వ్యాఖ్యలపై సామాన్య కేరళ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2011లో సరిగ్గా ఇన్‌కంట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టిన మోహన్‌లాల్‌పై ఐటీ అధికారులు దాడులు చేసి, ఆయన ఐటీ సరిగ్గా కట్టడం లేదని తేల్చారు. అలాంటి ఘనచరిత్ర కలిగిన మోహన్‌లాల్ తమకు ఇప్పుడు నీతులు చెబుతున్నాడంటూ విమర్శలు వస్తున్నాయి. మరోపక్క మోదీ పాతనోట్ల మార్పిడి ప్రకటించిన ముందురోజునే సుమారు 3,300కోట్ల రూపాయల నల్లదనాన్ని మోహన్‌లాల్ కువైట్‌లోని ఓ మైనింగ్ సంస్థలో పెట్టుబడిగా పెట్టాడనే విమర్శలు వస్తున్నాయి. ఆయన వద్ద అంత పెద్ద మొత్తం ఎక్కడి నుండి వచ్చిందని, మోదీ నిర్ణయానికి ముందు రోజే ఆయన తన సన్నిహితులకు చెందిన కువైట్ డ్రిల్లింగ్ కంపెనీలో అంత పెద్ద మొత్తం పెట్టుబడి పెట్టడం ఎలా సాధ్యమైందంటూ అత్యధిక అక్షరాస్యత, జనచైతన్యం ఎక్కువగా ఉండే కేరళలోని స్వచ్చంధ సంస్ధలతో పాటు పలువురు ప్రశ్నిస్తున్నారు. కాగా మోహన్‌లాల్ అంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టిన విషయంలోని కొన్ని ఆధారాలను సైతం అక్కడి మీడియా బయటపెట్టింది. దీంతో మోహన్‌లాల్‌పై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కేరళలో ఊపందుకుంది. మరి ఈ విమర్శలకు మోహన్‌లాల్ ఎలా స్పందిస్తాడో వేచిచూడాలి. కాగా మోహన్‌లాల్‌కు అనుకూల మీడియా మాత్రం ఈ విషయాలను ఖండించనప్పటికీ మౌనం వహిస్తుండటం విశేషం.