ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రాంతీయభిమానులు పరాకాష్టకు చేరుకుంటున్నాయి. కుహనా రాజకీయనాయకులు ప్రాంతీయద్వేషాలు రగిలేలా ప్రజలను రెచ్చగొడుతున్నారు. దీంతో తెలుగు ప్రజలు తెలంగాణ, ఏపీలుగా కూడా విడిపోయారు. దీంతో మన స్టార్ హీరోలు, దర్శకనిర్మాతలు రెండు ప్రాంతాల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు పాటిస్తూ, రెండు రాష్ట్రాలలోని తమ అభిమానులను బ్యాలెన్స్ చేస్తున్నారు. ఆడియో వేడుక ఒక రాష్ట్రంలో జరిగితే, ప్రీరిలీజ్ ఫంక్షన్లు, సక్సెస్‌మీట్‌ల వంటి వాటిని మరో రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ కూడా ఇదే దారిలో వెళ్తున్నాడు. ఆయన ప్రస్తుతం ఏపీలోని హిందూపురం నుంచి శాసనసభ్యునిగా ఉన్నాడు. ఇక దీంతో ఆయన ఏపీకి అనుకూలంగా ఏమి మాట్లాడినా కూడా తెలంగాణ నాయకులు పనిగట్టుకొని ఆయన ఆంధ్రావాడు అంటూ తెలంగాణలోని ఆయన అభిమానులలో విషబీజాలు నాటుతున్నారు. దానికి తోడు ఆమధ్య ఆయన తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ వల్లే తెలంగాణ ప్రజలకు వరి అన్నం అంటే ఏమిటో తెలిసిందంటూ నోరుజారి వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఇకపై ఇలాంటివి జరగకుండా ఉండేలా బాలయ్య ముందు చూపు ప్రదర్శిస్తున్నాడు.
కాగా ప్రస్తుతం తాను చేస్తున్న వందో చిత్రం అమరావతిని కేంద్రంగా చేసుకొని పాలించిన గౌతమీపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర కావడంతో ఈ చిత్రం అనౌన్స్ ని సందర్భానుసారంగా ఆంధ్ర కి చెందిన అమరావతిలోనే జరిపాడు. చిత్రాన్ని తెలంగాణ లో తెలంగాణ సీఎం కెసిఆర్ సమక్షంలో ప్రారంభించాడు. ఇక సంక్రాంతికి విడుదల కానున్న తన చిత్రం ఆడియో వేడుకను రాయలసీమ కి చెందిన తిరుపతిలో డిసెంబర్ 16వ తేదీన చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడులు అతిథులుగా గ్రాండ్‌గా జరపడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇలా మూడు వేడుకలను మూడు ప్రాంతాల్లో జరిపి తనకి అందరూ కావాలనే సంకేతాన్ని ఇప్పుడు బాలయ్య పంపిస్తున్నాడు. మరి మూడు ప్రాంతాల ప్రజలు బాలయ్యకి ఎలాంటి హిట్ ని ఇస్తారో చూద్దాం.