బతికున్నపుడే చంపేస్తున్నారు అనే మాట ఇప్పుడు మీడియాకు వర్తిస్తుంది. బ్రేకింగ్ న్యూస్ అంటూ సంచలనం సృష్టించడం కోసం మీడియా ప్రసారం చేస్తున్న వార్తలు ఆందోళన, ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలను బతికుండగానే చంపేస్తూ, సంతాపాలు ప్రకటిస్తున్నారు. దాంతో సదరు వ్యక్తి తాను బతికే ఉన్నానంటూ నెత్తినోరు బాదుకోవాల్సి వస్తోంది. తాజాగా ఈ పరిస్థితి తమిళ నటుడు గౌండ్రమణికి ఎదురైంది. చాలా సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఇంటిపట్టునే ఉంటున్న గౌండ్రమణి అనారోగ్యంతో పోయాడని సామాజిక మాధ్యమాలు హడావుడి చేశాయి. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైనపుడు గౌండ్రమణి మీడియా ముందుకు వచ్చిన తన గోడు వెళ్ళబోసుకున్నాడు. పదే పదే తనను చంపేస్తుండడంతో ఈసారి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడట.
ఇలాంటి చావు కబుర్లు మన తెలుగు ఛానల్స్ సైతం పలు మార్లు ప్రసారం చేశాయి. నటులు మల్లికార్జునరావు, మాడా, ఎం.ఎస్. నారాయణ వంటి వాళ్ళని వారి మరణవార్త ధృవీకరణ అవకముందే చంపేశాయి.
హాస్యనటుడు వేణుమాధవ్‌కు సైతం ఇదే జరిగింది. నిక్షేపంగా ఉన్న తనని ఛానల్స్‌లో వెబ్ మీడియాలో చంపారని ఆరోపిస్తూ ఆయన కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
చావు వార్తలను ప్రసారం చేసేముందు పలురకాలుగా పరిశీలించి నిర్ధారణ చేసుకోవాలనే ఆలోచన లేకుండా మీడియా చేస్తున్న హడావుడి వల్ల చాలామంది కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.