పాతతరం హీరోలతో పోలిస్తే నేటితరం యంగ్‌హీరోలు ఎంతటి క్లిష్టమైన, ప్రమాదకరమైన సీన్స్‌లో కూడా డూప్‌లతో పనిలేకుండా వారే స్వయంగా రిస్క్ తీసుకొని చేస్తున్నారు. ఇలాంటి సమయాలలో వారు తరచుగా గాయాల పాలవుతున్నా పట్టించుకోవడం లేదు. ఇక మెగాబ్రదర్ నాగబాబు తనయుడు, మెగాహీరో వరుణ్‌తేజ్‌ది కూడా అదే సిద్దాంతం. తాజాగా ఆయన ఒకేసారి రెండు చిత్రాలలో నటిస్తున్నాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో 'మిస్టర్' చిత్రంతో పాటు, శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో 'ఫిదా' చిత్రాలను చేస్తున్నాడు. ఇప్పటివరకు సరైన కమర్షియల్ హిట్ అందకోకపోయినా తన నటన, వైవిధ్యభరిత చిత్రాలలో నటిస్తూ వస్తున్న ఆయన విమర్శకుల ప్రశంసలు మాత్రం పొందాడు. కాగా వరుణ్ ఇటీవల అంటే దాదాపు రెండునెలల కిందట 'మిస్టర్' చిత్రం షూటింగ్‌లో ఓ యాక్షన్ సీన్‌లో రిస్కీ షాట్‌లో తీవ్రంగా గాయపడి, ఇంటికే పరిమితమయ్యాడు. దాంతో ఆయన నటిస్తున్న రెండు చిత్రాలకు కాస్త బ్రేక్ వచ్చింది. తాజాగా గాయం నుంచి కోలుకున్న వరుణ్ మరలా ఈ రెండు చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటూ ఆ రెండు చిత్రాలను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని, తన వల్ల వచ్చిన గ్యాప్‌ను భర్తీ చేయాలని భావిస్తున్నాడు. దీంతో ఆయన రెస్ట్ అనే పదాన్ని మరిచిపోయి పనిచేస్తున్నాడు. ఆయన కమిట్‌మెంట్‌ను చూసి ఈ రెండు చిత్రాల యూనిట్లు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి ఈ యంగ్ మెగా హీరో తాను నిర్మాత, దర్శకుల నటుడినిగా నిరూపించుకుంటున్నాడు.