కరెన్సీ కష్టాల వల్ల మరో నాలుగైదు నెలలు చిత్ర పరిశ్రమపై తీవ్రదుష్పరిణామాలు ఉంటాయని, ముఖ్యంగా కొత్త చిత్రాల రిలీజ్‌లపై ఆ ఎఫెక్ట్ ప్రభావం ఉంటుందని చాలా మంది లెక్కలు వేశారు. దీనికి తోడు ఫర్వాలేదనే టాక్ వచ్చినప్పటికీ నాగచైతన్య 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం వసూళ్లు రాబట్టలేకపోయింది. దీంతో తమ తమ చిత్రాలను వాయిదా వేసుకోవడమే మేలని భావించిన పలువురు నిర్మాతలు, చివరకు డబ్బింగ్ చిత్రాల నిర్మాతలు కూడా కలత చెంది తమ చిత్రాలను వాయిదా వేసుకోవడం మేలని, ఈ ఎఫెక్ట్ దీర్ఘకాలం కొనసాగితే డిసెంబర్‌లోనే కాదు.. సంక్రాంతికి విడుదలయ్యే చిత్రాలపై కూడా దీని ప్రభావం ఉంటుందని తలలు పండిన వారు కూడా అంచనాలు వేశారు. కానీ సినిమాలో దమ్ముంటే ఇవ్వన్నీ అడ్డురావని చిన్నోడు నిఖిల్ నిరూపించాడు. ఆయన నటించిన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రం అద్భుతమైన టాక్‌తో, రివ్యూల రేటింగ్స్‌తో, విమర్శకుల ప్రశంసలతో పాటు సామాన్య ప్రేక్షకులను కూడా మెప్పిస్తూ ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదలైన అన్ని థియేటర్లలో అన్ని షోలు హౌస్‌ఫుల్స్‌తో నడుస్తోంది. ఇక ఈ కరెన్సీ కష్టాలు ఏమీ లేని ఓవర్‌సీస్ మార్కెట్‌లో కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది. కేవలం మొదటి మూడురోజుల్లోనే రూ.5 కోట్లకు పైగా షేర్ సాధించి, నిఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా సాగుతోంది. దీంతో ఈ శుభపరిణామం చాలామంది పెద్ద చిత్రాల, స్టార్‌హీరోల నిర్మాతలతో పాటు స్టార్స్‌కు కూడా మంచి మార్గదర్శకంగా నిలిచి, వారికి బూస్టప్‌నిచ్చిందనే చెప్పాలి. మొత్తానికి ఈ చిత్రంతో నిఖిల్ తాను చిన్నోడినైనా గట్టోడినని నిరూపించుకుంటున్నాడు. హ్యాట్సాఫ్ టు నిఖిల్ అండ్ హిజ్ యూనిట్ అని చెప్పకతప్పదు.