Advertisementt

క్రియేటివ్‌ దర్శకుడిని మోసం చేసిందెవరు?

Tue 22nd Nov 2016 09:00 PM
director krishna vamshi,tollywood,mogudu movie,krishna vamshi movies  క్రియేటివ్‌ దర్శకుడిని మోసం చేసిందెవరు?
క్రియేటివ్‌ దర్శకుడిని మోసం చేసిందెవరు?
Advertisement

టాలీవుడ్‌లో క్రియేటివ్‌ దర్శకునిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు కృష్ణవంశీ. తన మొదటి చిత్రం 'గులాబి'తో ఆయన యువతరం దర్శకునిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత నాగార్జున హీరోగా చేసిన 'నిన్నేపెళ్లాడతా' చిత్రంతో ఫ్యామిలీ, యూత్‌ ఆడియన్స్‌ను మెప్పించి స్టార్‌ దర్శకునిగా పేరు తెచ్చుకున్నాడు. బాలీవుడ్‌లో వచ్చిన 'మైనే ప్యార్‌ కియా' వంటి చిత్రాల కోవలో రూపొందిన తెలుగు చిత్రంగా 'నిన్నేపెళ్లాడతా' చిత్రం టాలీవుడ్‌ చరిత్రలో నిలిచిపోయింది. మహేష్‌బాబుతో చేసిన 'మురారి' చిత్రం కూడా అచ్చతెలుగు గ్రామీణ చిత్రంగా, కుటుంబ బంధాలకు, యాక్షన్‌ను మిక్స్‌ చేసిన చిత్రంగా పేరు తెచ్చుకుంది. కృష్ణవంశీ అంటే స్క్రీన్‌ నిండా ఆర్టిస్టుల హడావుడితో, అచ్చమైన తెలుగుదనంతో నిండివుంటాయనే పేరు ఉంది. ఇటీవల ఆయన రామ్‌చరణ్‌ హీరోగా తీసిన 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం కూడా అదే కోవకు చెందిన చిత్రంగా చెప్పుకోవాలి. ఈ చిత్రం పెద్దగా హిట్‌ కాకపోయినా చరణ్‌కు మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు, ఓవర్‌సీస్‌లో ఇలాంటి కుటుంబ బంధాలతో కూడిన చిత్రాలను ఆదరించే ఆడియన్స్‌లో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఆయన తీసిన 'సింధూరం', 'ఖడ్గం' వంటి చిత్రాలు సామాజిక స్పృహ కలిగిన చిత్రాలుగా మంచి విజయాలను నమోదు చేసి, మేథావుల, విమర్శకుల ప్రశంసలను పొందాయి. 

ఇక కృష్ణవంశీకి హీరోయిన్లను ఎంతో అందంగా చూపిస్తాడని, పాటలను అత్యద్భుతంగా తీస్తాడనే పేరు కూడా ఉంది. కొందరు దర్శకులు తాము తీసిన చిత్రాలలోని పాటలను మాత్రం కృష్ణవంశీని బతిమిలాడుకొని తీయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక వర్మ స్కూల్‌కు చెందిన కృష్ణవంశీకి ముక్కుసూటిగా మాట్లాడుతాడని, నిర్మోహమాటంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తాడనే మంచి పేరు కూడా ఉంది. అయితే ఆయనపై కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. ఒక్కో సినిమా తీయడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో పాటు ఎంతకీ రాజీపడకుండా రెండున్నర గంటల నిడివి గల చిత్రం తీయమంటే దానికి రెండింతల లెంగ్త్‌ కలిగినవిగా తీసి, నమ్ముకున్న నిర్మాతలకు డబుల్‌ బడ్జెట్‌ ఖర్చు చేయిస్తాడనే అపవాదు కూడా ఆయనపై ఉంది. అయితే ముందుగా చెప్పినట్లు ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా మాట్లాడుతాడనే పేరున్న కృష్ణవంశీ తాజాగా తన కెరీర్‌లోని చిత్రాల గురించి చెబుతూ, తాను ఇప్పటివరకు 19 చిత్రాలు చేశానని, తాను తీసిన చిత్రాలలో తనకు ఇష్టమైన చిత్రాలు చాలా ఉన్నప్పటికీ తనకు పూర్తిగా సంతృప్తినిచ్చిన చిత్రం మాత్రం 'చందమామ' అని చెప్పాడు. 'డేంజర్‌' చిత్రం పెద్దగా ఆడకపోయినా ఆ చిత్రం కూడా తనకు బాగా నచ్చిందన్నాడు. ఇక తాను తీసిన చిత్రాలలో అతి చెత్త చిత్రం గోపీచంద్‌తో తీసిన 'మొగుడు' అని తేల్చేశాడు. ఇక నానితో తీసిన 'పైసా' చిత్రం కూడా తన చెత్త చిత్రాలలో ఒకటిగా ఆయన అభివర్ణించాడు. అయితే 'మొగుడు' చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ, తనకు ఆ చిత్రం చెత్తగా వస్తున్నట్లు షూటింగ్‌ సమయంలోనే అర్ధమైందని, కానీ ఒక వ్యక్తి చేసిన మోసం వల్ల తాను ఆ చిత్రం తీయాల్సివచ్చిదంటూ చెప్పుకొచ్చాడు. కానీ ఆ మోసం చేసిన వ్యక్తి ఎవరు? ఎలా మోసం చేశాడు? 'మొగుడు' చిత్రం తీయడానికి, ఆ వ్యక్తి చేసిన మోసానికి ఉన్న లింక్‌ ఏమిటి? అనే విషయాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతం కృష్ణవంశీని మోసం చేసింది ఎవరు? అనే అంశం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఏదిఏమైనా తన చిత్రాల గురించి, వాటిలో తనకు నచ్చిన, నచ్చని చిత్రాల గురించి కృష్ణవంశీ ఎంతో నిజాయితీగా మాట్లాడాడని ఆయన అభిమానులు మెచ్చుకుంటున్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement