తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ప్రధానంగా రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బతగిలిందనే చెప్పాలి. తెలంగాణలో కొంత పర్వాలేదుగానీ, ఆంధ్రప్రదేశ్ లో అయితే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆడ్రస్ గల్లంతయిందనే చెప్పాలి. కాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో కార్యక్రమాలు చేస్తూ ఆదిశగా ప్రజల్లోకి వెళ్తుంది. తెలుగు ప్రజలను అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో తాము నిలదొక్కుకొనేందుకు ప్రజా ఉద్యమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా ఆయా సమస్యలకు అనుగణంగా నిత్యం ప్రజల్లో నుండి స్పందిస్తూ ఆ విధంగా ముందుగు వెళ్తూ ప్రజల్లో తమ ఉనికిని కాపాడుకొనేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అయితే ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైకాపాతో సమానంగా పోటాపోటీగా ప్రజలతో కలిసి పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాగా ఇక్కడ సమస్య ఏం వచ్చిందంటే ఇక ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోలుకునే పరిస్థితి లేదు. అందుకనే కాంగ్రెస్ పార్టీ, వైకాపాలో కలవడమో, లేకా వైకాపాను కాంగ్రెస్ లో విలీనం చేసి ముందుకు వెళ్ళడమో ఏదో ఒకటి చేసైనా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని విశ్వప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య రాష్ట్ర విభజన సమయంలో గుప్పించిన హామీలు అమలు చేయాలంటూ, ఇంకా ఏపీకి ప్రత్యేక హోదా అని కాంగ్రెస్ పార్టీ నిరంతరం పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంది. అందుకోసమని రాజ్యసభలో కూడా ఆ పార్టీ సీనియర్ నేత ఎంపీ కేవీపీ రామచంద్రరావు పలుమార్లు ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రంలోని ఎన్ డిఏ సర్కార్ ను నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఏపీ కాంగ్రెస్ నాయకలు పలు రకాలుగా ఉద్యమిస్తున్నారు.
కాగా రైతు, డ్వాక్రా గ్రూపుల రుణ మాఫి, ఇంటికో ఉద్యోగం వంటి అంశాలు టిడిపి ఎన్నికల హామీలపైనా కాంగ్రెస్ పార్టీ గళం ఎత్తుతుంది. ఈ మధ్యనే కర్నూలు జిల్లాలో ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని రైతు సభను కూడా నిర్వహించింది.
అయితే కాంగ్రెస్ పార్టీ తెలుగువారిని విడగొట్టిందన్న కోపం ఏపీ ప్రజలను ఇంకా పీడిస్తుంది. ఇప్పటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం కష్టమౌతుందని, వైకాపాతో కలిసి పోతే బాగుంటుందన్నది ఏపీ కాంగ్రెస్ నాయకుల ధీమా. అయితే వైకాపాలో తాము కలవడమా, కాంగ్రెస్ లో వైకాపాను విలీనం చేసి ఏపీలో కాంగ్రెస్ పార్టీ వైభవాన్ని చాటడమా అన్నదానిపై ఇప్పుడు చర్చ నడుస్తుంది.