ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్‌బాబు.. మురుగదాస్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ద్విభాషా చిత్రంగా రూపొందుతోంది. కాగా ఈ చిత్రానికి హారీస్‌జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు. గతంలో ఆయన మహేష్-గుణశేఖర్-అశ్వనీదత్ కాంబినేషన్‌లో వచ్చిన 'సైనికుడు' చిత్రానికి సంగీతం అందించాడు. ఈ చిత్రంతో తెలుగులో కూడా హారీస్‌జైరాజ్ దశ తిరిగిపోతుందని అందరూ భావించారు. కానీ ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలవడంతో పాటు మ్యూజిక్ పరంగా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోవడం, స్ట్రైయిట్‌గా తెలుగులో ఆయన స్టార్స్‌కు అందించిన చిత్రాలన్నీ పెద్దగా ఆడకపోవడంతో హారీస్‌జైరాజ్ మరలా కేవలం కోలీవుడ్‌కే పరిమితం అయ్యాడు. మరలా ఇంతగ్యాప్ తర్వాత మురుగదాస్ చలవతో మరోసారి మహేష్‌బాబు చిత్రానికి సంగీతం అందించే సువర్ణావకాశం హారీస్‌జైరాజ్‌కు లభించింది. ఇక ఈ చిత్రం తర్వాత మహేష్‌బాబు కొరటాల శివ దర్శకత్వంలో దానయ్య నిర్మించే చిత్రంలో నటించనున్నాడు. దీనికి కొరటాల తనకు బాగా ట్యూన్ అయిన దేవిశ్రీప్రసాద్‌నే పెట్టుకున్నాడు. ఆ తర్వాత మహేష్ తన కెరీర్‌లో 25వ చిత్రంగా పివిపి బేనర్‌లో వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఓ ప్రతిష్టాత్మక చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రం స్క్రిప్ట్‌వర్క్ కూడా మొదలైంది. వచ్చే ఏడాది జూన్‌లో ఈ చిత్రం పట్టాలెక్కనుంది. కాగా మలయాళ సంగీత దర్శకుడు, నేషనల్ అవార్డు విన్నర్ అయిన గోపీసుందర్ ఈ చిత్రానికి సంగీత దర్శకునిగా ఖరారయ్యాడు. ఈయన ఆల్‌రెడీ కొన్ని తెలుగు చిత్రాలకు సంగీతం అందించాడు. అందులో వంశీపైడిపల్లి- పివిపి బేనర్‌లో తెలుగు, తమిళ భాషల్లో నాగార్జున-కార్తీలు హీరోలుగా రూపొందిన 'ఊపిరి' చిత్రానికి కూడా అద్భుతమైన సంగీతం అందించాడు. దీంతో వంశీపైడిపల్లికి గోపీసుందర్‌తో మంచి ట్యూన్ కుదిరింది. కాగా వంశీపైడిపల్లి.. మహేష్‌తో పివిపి బేనర్‌లో చేయనున్న చిత్రానికి కూడా గోపీసుందర్‌నే ఎంచుకున్నాడు. ఇప్పటికే మంచి సంగీత దర్శకునిగా పేరొందిన గోపీసుందర్‌కు ఈ చిత్రం టర్నింగ్ పాయింట్ అవుతుందని భావిస్తున్నారు. మహేష్ వంటి స్టార్ చిత్రానికి సంగీతం అందించే అవకాశంతోపాటు ఈ చిత్రంలో మాస్‌ను కూడా అలరించేలా అన్ని వర్గాలను అలరించే సాంగ్స్ ఉంటాయని, దీంతో గోపీసుందర్ కమర్షియల్ సినిమాలకు కూడా సంగీతం అందించగలడని నిరూపించుకొని, టాలీవుడ్‌లో మరింత గుర్తింపు తెచ్చుకుంటాడని సంగీతాభిమానులు ఆశిస్తున్నారు.