సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్, అమీజాక్సన్ జంటగా బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ విలన్‌గా నటిస్తున్న'రోబో'కు సీక్వెల్‌గా దర్శకదిగ్గజం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'రోబో2'. కాగా ఈ చిత్రాన్ని శంకర్ తమిళ, హిందీ, తెలుగు, మలయాళ ఇలా అన్ని భాషల్లోనూ '2.0' అనే టైటిల్‌నే ఫిక్స్ చేశాడు. తాజాగా ముంబైలోని యష్‌రాజ్ ఫిల్మ్స్ స్టూడియోలో ఈ చిత్రం టైటిల్ లోగోను, హీరో రజనీ, విలన్ అక్షయ్‌కుమార్‌ల లుక్స్‌తో కూడిన పోస్టర్స్‌ను విడుదల చేశారు. కాగా ఈ చిత్రం లోగో, లుక్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ప్రస్తుతం అన్ని భాషల్లోని సినీ అభిమానులను ఇవి విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు అందరూ వీటినే చూస్తూ మైమరిచిపోతున్నారు.
కాగా ఈ చిత్రానికి 'రోబో2.0' అనే టైటిల్‌ను కాకుండా కేవలం '2.0' అని మాత్రమే అన్ని భాషల్లో పెట్టడం వెనుక కూడా శంకర్ తన తెలివితేటలను ప్రదర్శించాడు. తమిళంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం తమిళ భాషాభివృద్దిలో భాగంగా తమిళ చిత్రాలకు కేవలం తమిళ టైటిల్స్‌నే పెట్టే చిత్రాలకు, ఆయా దర్శకనిర్మాతలకు ఎన్నో రాయితీలను కల్పిస్తోంది. అందుకే గతంలో శంకర్ తన 'రోబో' చిత్రానికి తమిళంలో మాత్రం 'యంతిరన్' అనే టైటిల్ పెట్టాడు. అయితే కేవలం అంకెలతో విడుదల చేసే చిత్రాలకు మాత్రం తమిళంలో మినహాయింపు ఉంది. అంకెలతో పెట్టే టైటిల్స్‌కు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలు పనిచేస్తాయి. అందుకే ఈ మధ్య సూర్య కూడా తన చిత్రానికి '24' అనే టైటిల్‌ను పెట్టి తెలివిగా తమిళంలోని రాయితీలను కూడా పొందగలిగాడు. ఇప్పుడు శంకర్ సైతం 'రోబో2.0' అనే టైటిల్‌ను పెడితే 'రోబో' అనే ఇంగ్లీషు పదం వల్ల తమ చిత్రానికి రాయితీలు రావని అర్ధం చేసుకొని, తెలివిగా కేవలం '2.0' అని మాత్రమే తన చిత్రానికి టైటిల్‌గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రం ఇండియాలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రంగా చెబుతున్నారు. దీనికి 350కోట్లు బడ్జెట్‌ను లైకా సంస్థ కేటాయించిందట. ఇక తాజాగా విడుదలైన ఈ చిత్రం రజనీ, అక్షయ్‌కుమార్‌ల లుక్స్‌లో విలన్‌గా నటిస్తున్న అక్షయ్ లుక్‌కే ఎక్కువగా స్పందన లభిస్తుండటం విశేషంగా చెప్పాలి. ఇక ఈచిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయాలని నిర్ణయించారు. తెలుగులో సమ్మర్, దసరా, సంక్రాంతి సీజన్‌లకు ఉన్న డిమాండ్‌తో పోలిస్తే దీపావళి సీజన్‌కు మాత్రం పెద్దగా క్రేజ్ ఉండదు. ఈ పండగకు తెలుగునాట కేవలం ఒకటి రెండు రోజులే సెలవలు ఉంటాయి. కానీ తమిళంలో మాత్రం వారికున్న పండుగలన్నింటిలోకి దీపావళి పండుగకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అక్కడి వారు దీపావళిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దీంతో తమిళులకు అత్యంత ముఖ్యమైన దీపావళికి అంటే వచ్చే దీపావళికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి నిర్ణయించారు.