ఈ మధ్యన సీనియర్ నటులు ఒక్కొక్కళ్ళుగా సినిమా పరిశ్రమపై తమ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు. తమకు సినిమా పరిశ్రమలో గౌరవ మర్యాదలు లభించడం లేదని అంటున్నారు. ఆ మధ్యన ప్రస్తుత సినిమా పరిశ్రమ పరిస్థితులపై సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు తన ఆవేదనను వెళ్లగక్కిన విషయం తెలిసిందే. ఆయన ఇప్పుడొస్తున్న దర్శకులు పరభాషా నటులను తెలుగులోకి అరువు తెచ్చుకుని టాలీవుడ్ లో వున్న నటులను, సీనియర్స్ ని అవమానిస్తున్నారని కొంచెం గట్టిగానే మాట్లాడాడు. ఇక ఇప్పుడు చంద్రమోహన్ కూడా తన ఆవేదనను, బాధను వెళ్లగక్కారు. ఆదివారం ఏలూరులో జరిగిన వనమోహోత్సవ కార్యక్రమం లో ఆయన మీడియా తో మాట్లాడుతూ.... నేను ఇప్పటివరకు 800 లు పైగా సినిమాల్లో నటించానని... . తన 50 ఏళ్ళ సినీజీవితం తనకు సంతృప్తినిచ్చిందని రంగులరాట్నం, సువర్ణనంది చిత్రాలు జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రాలుగా ఎంపికయ్యాయని అప్పటి తియ్యని జ్ఞాపకాలు ఎప్పటికి మరువలేనని అన్నారు. ఇక ఆయన ప్రస్తుతం సినిమా పరిశ్రమలో నెలకొని ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ... ఇప్పుడు సినిమా పరిశ్రమలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని.... ఈ తరం హీరోలు ఎన్టీఆర్, అమితాబచ్చన్‌ల మాదిరి తెగ ఫీల్ అయిపోతూ తామేదో సాధించేశామనే ధోరణిలో ఉన్నారని అన్నారు. అసలు సీనియర్ నటుల్ని ఏమాత్రం గౌరవించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఇప్పుడు వస్తున్న సినిమాలు అశ్లీలత, ఫైట్స్, కామెడీ అంటూ రొటీన్ కథలుగానే ఉంటున్నాయని.... కామెడీ కి పెద్దగా చోటు లేకుండా పోయిందన్నారు. అసలు ఈ రోజుల్లో సినిమాలు 100 రోజులు ఆడడమే గగనం అయిపోయాయని.... కనీసం రెండు వారాలు కూడా థియేటర్స్ లో నిలబడలేకపోతున్నాయని అన్నారు. ఇక ఆర్టిస్టుగా క్యారెక్టర్లు కూడా దొరకడం లేదన్నారు. మరి ఈ సీనియర్ నటుల బాధను ఎవరైనా అర్ధం చేసుకుంటారేమో చూద్దాం.