అక్కినేని వారసుడిగా తమ వంశానికి అచ్చిరాని మాస్ అండ్ సోషియో ఫాంటసీ కథతో తొలిచిత్రానికే 40కోట్ల బడ్జెట్‌ను నిర్మాత నితిన్ చేత పెట్టించి మొదటి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ కొట్టాలని అఖిల్ భావించాడు. ఈ చిత్రాన్ని ఆయన వినాయక్ దర్శకత్వంలో చేశాడు. వాస్తవానికి తన మొదటి చిత్రం విషయంలో అఖిల్ మితిమీరిన ఆత్మవిశ్వాసం చూపించి దెబ్బతిన్నాడు. ఇక తన తొలిచిత్రం స్టోరీ ఎంపిక నుండి దర్శకుని ఎంపిక, నిర్మాత ఎంపిక, పెట్టిన బడ్జెట్ వంటివేమీ ఆయన తండ్రి నాగ్‌కు ఇష్టం లేదనే ప్రచారం ఉంది. కానీ తండ్రి మాటను కూడా కాదని అఖిల్ తన నిర్ణయంప్రకారమే పట్టుబట్టి అన్ని చేయించాడు అనేది అక్షర సత్యం. 'మనం'చిత్రంలో ఆయన చేసిన గెస్ట్ రోల్‌లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు.. ఆయన ఇంకా స్టార్‌హీరోగా మారకుండానే ఏదో విధంగా యాడ్ అంబాసిడర్‌గా అనేక కంపెనీలకు పనిచేస్తున్నాడు. దాంతో ఆయనకు యాడ్ రంగంలో కూడా మంచి క్రేజే వచ్చింది. ఇదంతా తెరవెనుక నుండి నాగ్ తన పలుకుబడితో ఇప్పిస్తున్న పబ్లిసిటీనే అనే వార్తలు కూడా వచ్చాయి. మొత్తానికి కర్ణుడి చావుకు శతకోటి కారణాలన్నట్లు అఖిల్ తొలి చిత్రం 'అఖిల్' డిజాస్టర్‌కు కూడా ఎన్నో కారణాలున్నాయి. అందుకే ఓవర్‌బడ్జెట్ కూడా ఇందులో ఒకటని ట్రేడ్‌పండితులు చెబుతుంటారు. కాగా జనవరి నుండి ఆయన తన రెండో చిత్రంగా 'మనం' దర్శకుడు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ఓ వినూత్న ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రం నాగ్ నిర్మాతగా అన్నపూర్ణ బేనర్‌లోనే రూపొందనుంది. కాగా ఈ స్క్రిప్ట్ కూడా భారీగా బడ్జెట్‌ను డిమాండ్ చేస్తోందని, కాబట్టి ఈ చిత్రానికి కూడా ఇంచుమించు 40కోట్ల వరకు బడ్జెట్ కేటాయించాల్సి వస్తుందనే టాక్ నడుస్తోంది. ఈ విషయంలో నిర్మాత నాగ్‌ను అఖిల్‌తో పాటు విక్రమ్ కె.కుమార్ కూడా పట్టుబడుతున్నట్లు సమాచారం. కాగా నాగ్ చాలా కాలిక్యులేటెడ్ ప్రొడ్యూసర్. కథకు, ఆ హీరోకు ఉన్న డిమాండ్‌ను, మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ పెడతాడు. బయటి హీరోల చిత్రాలకేకాదు.. తాను నటించే చిత్రాల బడ్జెట్‌లో కూడా ఆయన అదే సూత్రం పాటిస్తాడు. అంతేకాదు.. బయటి నిర్మాతలు అయినా సరే తన చిత్రాలకు తన మార్కెట్‌కు మించిన బడ్జెట్‌ను పెడుతున్నప్పుడు ముందుగానే హెచ్చరిస్తాడు. నాటి రక్షకుడు, చైతన్య చిత్రాల నుండి నిన్నటి 'ఢమరుకం' వరకు దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక విక్రమ్.కె.కుమార్ విషయానికి వస్తే కూడా ఆయన తీసిన చిత్రాలన్నీ ఒక్క '24' మినహా అన్నీ మీడియం, లోబడ్జెట్ చిత్రాలే. 'మనం' వంటి చిత్రాన్ని కూడా ఆయన లిమిటెట్ బడ్జెట్‌లోనే పూర్తి చేసి విజయం సాధించి నిర్మాత నాగ్‌కు పెద్ద హిటు అందించాడు. కానీ ఆయన సూర్యతో చేసిన '24' చిత్రానికి మాత్రం ద్విభాషా చిత్రం కావడం, సైన్స్‌ఫిక్షన్ మూవీ కావడంతో 70కోట్ల బడ్జెట్ పెట్టించాడు. కానీ ఈ చిత్రం కమర్షియల్‌గా మాత్రం నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలనే మిగిల్చింది. విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ తమిళవెర్షన్ హిట్ కాకపోవడం దీనికి ప్రధానకారణం. మరి అఖిల్‌తో చేయబోయే రెండో చిత్రం లవ్‌స్టోరీ అయినా కూడా అంత పెద్ద బడ్జెట్‌ను స్టోరీ డిమాండ్ చేసినా, అఖిల్, విక్రమ్‌లు పట్టుబట్టినా నాగ్ 40కోట్లు పెట్టడానికి సిద్దపడతాడా? అనేది అనుమానంగానే కనిపిస్తోంది.