ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు ఎక్కువ కాలం నిలబడవు. అందుకే ఓ కీలకనిర్ణయం తీసుకునేటప్పుడు ముందు, వెనుక ఆలోచించాలి. అది ఎంత వరకు తమకు వీలవుతుందో తేల్చుకోవాలి. లేకపోతే మాట తప్పిన వారి జాబితాలో చేరిపోవాల్సిందే. ఉదాహరణకు గతంలో వర్మ ఇక తెలుగులో చిత్రాలు చేయనని చెప్పి, ఆ తర్వాత మరలా టాలీవుడ్‌కు వచ్చి వరుస చిత్రాలు చేశాడు. రజనీకాంత్ సైతం తన చిత్రాలు కొన్ని పూర్తిగా డిజాస్టర్స్‌గా నిలిచిన సమయంలో బాధతో ఇక సినిమాల నుండి రిటైర్ కావాలనుకున్నాడు. కానీ అది నిజం కాలేదు. అలాగే కొన్ని చోట్ల తనకు వస్తున్న క్రేజ్ చూసి రాజకీయాల్లోకి కూడా రావాలని భావించాడని ఆయన సన్నిహితులు చెబుతారు. కానీ రజనీ సైతం బాగా ఆలోచించిన తర్వాత తను రాజకీయాల్లోకి రాకూడదనే నిర్ణయించుకున్నాడు. అమితాబ్ సైతం దర్శకుడు వర్మపై కోపంతో ఇక వర్మతో భవిష్యత్తులో చిత్రాలు చేయనన్నాడు. కానీ ప్రస్తుతం మనసు మార్చుకొని వర్మతో 'సర్కార్3' చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ కూడా 'వర్ణ'చిత్రం తర్వాత ఇక దర్శకత్వం చేయనని ప్రకటించాడు. తెలుగులో కూడా ఆయన తీసిన చిత్రాలు 'బృందావనం కాలనీ, యుగానికొక్కడు', తెలుగులో విక్టరీ వెంకటేష్‌తో తీసిన డైరెక్ట్ మూవీ 'ఆడవారి మాటలకు అర్థాలేవేరులే' చిత్రాలతో శ్రీరాఘవగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా ఆయన 'వర్ణ' తర్వాత ఆరు నెలలకే తన నిర్ణయం మార్చుకొని శింబు హీరోగా ఓ చిత్రం తీయాలని భావించాడు. ఈ చిత్రం కూడా క్యాన్సిల్ అయింది. తాజాగా ఆయన ఎస్.జె.సూర్య హీరోగా తమిళంలో ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కమెడియన్ సంతానంతో కూడా ఓ చిత్రం చేయడానికి కమిట్ అయ్యాడు. ఇక తన సోదరుడు కార్తికి 'యుగానికొక్కడు'లాంటి హిట్ ఇచ్చిన ఆయనకు స్టార్ హీరో సూర్య సైతం ఓ అవకాశం ఇచ్చాడు. దీనిని నిర్మాతలు అధికారికంగానే ప్రకటించారు. మరి సెల్వ మాటతప్పిన వారి లిస్ట్‌లోకి చేరడం జరిగిపోయింది.