సినిమా రంగంలో అసాధారణ విజయాలు సాధించి, విమర్శకుల ప్రశంసలను అందుకుంటూ.. యంగ్ జనరేషన్ కు స్ఫూర్తినిచ్చే యువతరానికి మలయాళ పరిశ్రమ `ఆసియా విజన్ -2016`పేరిట`యూత్ ఐకన్` పురస్కారాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి కమిటీ టాలీవుడ్ నుంచి మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌ని ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక చేసుకోవడం విశేషం.
తనదైన ఛరిష్మాతో వెండితెరపై వెలుగులు విరజిమ్ముతున్న స్టార్ హీరో చరణ్‌కి కోట్లాది ప్రేక్షకాభిమానుల ఫాలోయింగ్ ఉంది. యువతరానికి స్ఫూర్తినిచ్చే అసాధారణ విజయాలు ఈ యువహీరో సొంతం. తన రెండో సినిమా(మగధీర)కే బాక్సాఫీస్ వద్ద 70 కోట్లు పైగా వసూళ్లు సునాయాసంగా రాబట్టిన హీరో చరణ్. అందుకే అతడి ప్రతిభకు చక్కని గుర్తింపు దక్కింది. ఇటీవల షార్జా స్టేడియం(యుఏఈ )లో జరిగిన `ఆసియా విజన్ -2016` వేడుకల్లో రామ్ చరణ్ కి అత్యున్నత `యూత్ ఐకన్` పురస్కారం అందించారు. దుబాయ్‌లో ప్రతియేటా నిర్వహించే అతి పెద్ద మలయాళ అవార్డుల కార్యక్రమం ఇది. 2006 నుంచి ఈ పురస్కారాల్ని అందిస్తున్నారు. లేటెస్టుగా చరణ్ నటించిన `ధృవ` అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే తను నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం `ఖైదీ నంబర్ 150` సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.