సాధారణంగా హీరోయిన్ల కెరీర్ చాలా స్వల్పకాలమే ఉంటుంది. కొత్త భామల రాకతో పాతవారు త్వరగానే తెరమరుగై పోతుంటారు. దీనికి ఐశ్వర్యారాయ్ వంటి కొందరు మాత్రమే మినహాయింపు. ఇక దక్షిణాదిలో మాత్రం ఇండస్ట్రీకి వచ్చి ఇంతకాలంగా అప్రతిహతంగా స్టార్‌హీరోయిన్‌గా దూసుకుపోతున్న ఘనత ఈ మధ్యకాలంలో కేవలం నయనతారకే సాద్యమైంది. మరీ ముఖ్యంగా కోలీవుడ్‌లో ఈ సీనియర్ భామ అంటే స్టార్‌హీరోల నుండి కుర్రహీరోల వరకు ఎగబడుతున్నారు. 30ఏళ్లను ఎప్పుడో క్రాస్ చేసిన ఈమె ఇంతలా ఇప్పటికీ తన హవా చాటుతుండటం విశేషంగానే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే స్టార్‌హీరోలతో నటించే చిత్రాలలో హీరోయిన్లు ఎవ్వరైనా కథలో వారికి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. కేవలం గ్లామర్‌షోతో పాటు హీరోలతో చిందులేయడానికే వారు పరిమితం అవుతున్నారు. ఇక ఆయా స్టార్ చిత్రాల ప్రమోషన్‌లో కూడా హీరోయిన్లకు పెద్దగా చోటివ్వరు. ఫస్ట్‌లుక్ నుండి పోస్టర్ల వరకు అన్నింటిలోనూ ఆయా హీరోలే కనిపిస్తుంటారు. దీనిపై గతంలో రెబల్ హీరోయిన్ సమంత మండిపడింది. పోస్టర్లలో కూడా తమకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా అవమానిస్తున్నారంటూ సూర్యతో నటించిన 'సికిందర్' చిత్రం సమయంలో ఈమె విమర్శలు చేసింది. ఆమె బాధను అర్దం చేసుకున్న దర్శకరచయిత త్రివిక్రమ్ మాత్రమే నితిన్-సమంతలు జంటగా నటించిన 'అ...ఆ' చిత్రం ప్రమోషన్లలో, టీజర్‌లో సమంతను మంచి ప్రాధాన్యం ఇచ్చాడు. ఈవిషయంలో నితిన్ కూడా బాగానే ఫీలయ్యాడనే వార్తలు కూడా వచ్చాయి. ఇక సమంత కోరికను ప్రస్తుతం నయనతార నిజం చేసి చూపిస్తోంది.
ఆమె ఇటీవల మమ్ముట్టి, విక్రమ్, వెంకటేష్ వంటి పెద్ద హీరోలతో చేసినప్పటికీ ఆమెకు పెద్దగా ఆ చిత్రాలు సంతృప్తిని ఇవ్వలేదు. దాంతో ఆమె ఇప్పుడు మొహమాటం లేకుండా స్టార్‌హీరోలకు నో చెబుతూ, నో స్టార్స్... ఓన్లీ స్మాల్ హీరోస్ అంటోంది. చిరంజీవి, అజిత్, బాలకృష్ణ వంటి పెద్దహీరోలకు నో చెప్పింది. దాంతో ఆమె ఇటీవలి కాలంలో తాను అనుసరించిన బాటలోనే మరోసారి నడుస్తోంది. కేవలం అప్‌కమింగ్ స్టార్స్ అయిన విజయ్‌సేతుపతి, జయం రవి, శివకార్తికేయన్, జీవా వంటి యువ హీరోలతోపాటు అధర్వ వంటి కొత్తవారికి ఓకే చెబుతోంది. ఇక ఆమె లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్‌లకు కూడా సై చెబుతోంది. టాలీవుడ్‌లో లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్‌లు చేస్తే ఇక ఆమె కెరీర్‌కు ముగింపుకు వచ్చిందనే అపవాదు ఉంది. కానీ కోలీవుడ్‌లో మాత్రం అలాంటి అపోహలు ఉండవు. ఉదాహరణకు ఆమె తెలుగులో శేఖర్‌మ్ముల దర్శకత్వంలో నటించిన బాలీవుడ్ 'కహాని' రీమేక్ 'అనామిక'లో విద్యాబాలన్‌కు పోటీగా అన్నట్లు నటనతో తన సత్తా చాటినా ఇక రిటైర్‌కు సమయమైందనే విమర్శలు రావడం, తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించకపోవడం గమనార్హం. కానీ తమిళంలో మాత్రం ఆమె యువహీరోలతో హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రాలతో పాటు లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కూడా భారీ డిమాండ్ ఉంది. తాజాగా ఆమె కొత్త దర్శకుడు డాస్ రామస్వామి దర్శకత్వంలో 'డోరా' అనే లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్‌లో కూడా నటిస్తోంది. అప్‌కమింగ్ హీరోలు, కొత్తహీరోలు, లేడీ ఓరియంటెడ్ వంటి చిత్రాలలో అయితే తనకున్న ఇమేజ్ దృష్ట్యా తనకు అందరూ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆయా చిత్రాలకు మెయిన్ అట్రాక్షన్‌గా నయనే నిలుస్తుంది.
థియేటర్లలో ఓపెనింగ్స్‌కు కూడా ఆమే పెద్దదిక్కుగా మారుతుంది. ఆమె అదే కోరుకుంటోంది. సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి సినిమా విడుదలయ్యే వరకు అన్నింటిలో ఆమెకే తొలిప్రాధాన్యం. పోస్టర్లు, ఫస్ట్‌లుక్‌లు, టీజర్స్, ట్రైలర్స్ ఇంకా అన్నింటికి ఆమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారుతోంది. ఇక నయన సాదారణంగా ప్రమోషన్లకు రాదు. ప్రమోషన్లకు రావాలంటే విడిగా ఆమెకు ప్రత్యేక పారితోషికం ఇవ్వాల్సివుంటుంది. కానీ పెద్ద హీరోల చిత్రాలలో ఈ పప్పులు ఉడకవు. దీంతో చిన్న, మద్యతరగతి హీరోలు, తానే ప్రధానపాత్రలో నటించే చిత్రాలకైతే తన ప్రమోషనే దర్శకనిర్మాతలు, హీరోలకు గతి అవుతుంది. దాంతో ఆమెను ప్రమోషన్‌కు రప్పించడం తప్పనిసరి అవుతుంది. తనకు ఎక్స్‌ట్రా రెమ్యూనరేషన్ వస్తుంది. అంతేకాదు.. ఇలాంటి చిత్రాలలో అయితే నిర్మాతలు ఆమెకు స్టార్‌హీరోల చిత్రాల కంటే ఎక్కువ పారితోషికం ఆఫర్ చేసి, ఆమె డిమాండ్ చేసినంత ఇస్తారు. ఇలా ఒకే దెబ్బతో రెండు మూడు పిట్టలను కొట్టినట్లు అవుతుంది. ఇలా ఆమె సమంత కలను నిజం చేస్తోంది.