2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్నయ్య చిరంజీవి కేంద్రమంత్రిగా ఉన్నప్పటికీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పవన్ ఓ అడుగు ముందుకేసి, నరేంద్రమోడీని సమర్దించి రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచాడు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ విడగొట్టిన విధానం చూసి మనస్తాపం చెందిన పవన్ విభజన సందర్భంగా పార్లమెంట్‌లో వెంకయ్యనాయుడు మాట్లాడిన విధానం, ఆంధ్రాకు ప్రత్యేకహోదా వంటి విషయాలలో బిజెపి అనుకూలంగా మాట్లాడి తన చిత్తశుద్దిని నిరూపించుకుందని భావించిన పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ఆయన మోదీకి, బిజెపికి మద్దతు పలికాడు. కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపికి మద్దతు ప్రకటించి, తాను స్దాపించబోయే జనసేన పార్టీ.. బిజెపికి మద్దతు ఇస్తుందని ప్రకటించాడు. కానీ మొదట్లో ఆయన రాష్ట్రంలో టిడిపికిగానీ, వైసీపీకి గానీ మద్దతు పలకలేదు. రాష్ట్రంలో మీకు నచ్చిన వారికి ఓటేయవచ్చని కూడా తనను సమర్దిస్తున్న వారికి తెలిపాడు. కానీ ఆ తర్వాత రాష్ట్రంలో బిజెపికి, టిడిపికి పొత్తు కుదరడం, బాబు మరలా బిజెపి ఆధ్యర్యంలోని ఎన్డీయేకు మద్దతు ఇవ్వడంతో ఆయన సంకీర్ణ ధర్మాన్ని పాటించి, తన వల్ల కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు చీలిపోకూడదనే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పి, మోదీ, చంద్రబాబులు ఉమ్మడిగా పెట్టిన సభలకు కూడా హాజరై తన మద్దతు ప్రకటించాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత బిజెపి ప్రత్యేకహోదాపై మాటమార్చడం, టిడిపి కూడా దానికి ఓకే చెప్పడంతో ఆయన మరలా బహిరంగ సభలు పెట్టి మరీ బిజెపిని చీల్చిచెండాడుతున్నాడు.
కానీ ఆయన మొదటి రెండు సభల్లో టిడిపి పట్ల మాత్రం మెతకవైఖరి చూపించాడు. కానీ ఇటీవల అనంతపురంలో పెట్టిన సభలో మాత్రం ఆయన బిజెపితో పాటు టిడిపి విధానాలపై కూడా పలు ఘాటైన విమర్శలు తెచ్చాడు. వాస్తవానికి పవన్ మద్దతు ఇవ్వడం ఎన్నికల్లో బిజెపి-టిడిపి కూటమికి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఇక ఆయన బిజెపి పట్ల ఎక్కువగా ఆకర్షితుడై, బిజెపికి మద్దతు పలకడంతో తమకు మద్దతునిచ్చిన పవన్ జనసేనతో తమ పార్టీకి కూడా పవన్ సానుభూతిపరునిగా మారాడని భావించిన బిజెపి పవన్ అండతో చిరుకు పోటీగా, తమ పార్టీకి కూడా అత్యంత ప్రజాదరణ ఉన్న సినీస్టార్ అండ దొరికిందని, దీన్ని సద్వినియోగం చేసుకొని పవన్‌ను అడ్డుపెట్టుకొని బిజెపి ఏపీలో కూడా బలపడాలని భావించింది. కానీ పవన్ ప్రత్యేకహోదాపై తమను సూటిగా విమర్శించే సరికి బిజెపి నాయకులకు అహం పెరిగింది. తాజాగా ఆయన అనంతపురం సభలో టిడిపిని కూడా విమర్శించినప్పటికీ చంద్రబాబుతో పాటు టిడిపి నాయకులు దీనిపై పవన్‌ను ప్రత్యక్షంగా విమర్శించలేదు. అలా చేస్తే అది తమ మనుగడకు దెబ్బని భావించడమే దీనికి కారణం.
కానీ ఏపీకి బిజెపి కూడా అన్యాయం చేసి, ఇచ్చిన మాట తప్పడంతో వచ్చే ఎన్నికల్లో కూడా ఏపీలో బిజెపి పరిస్థితి ఖాళీ అని విశ్లేషకులు తేల్చేశారు. కాంగ్రెస్‌కు పట్టిన గతే బిజెపికి తప్పదంటున్నారు. దీంతో అతి చిన్న రాష్ట్రంగా మారిన ఏపీపై ఆశలు వదిలేసుకున్న బిజెపి.. మోదీ వంటి చరిష్మా ఉన్న నాయకుడు ఉన్నంతకాలం దేశంలోని అత్యధిక స్ధానాలలో తమకు గెలుపు తధ్యమని భావించి, చంద్రబాబు, టిడిపి నాయకుల కంటే పవన్‌పై తమ విమర్శలకు పదునుపెట్టి, పవన్‌తో కటీఫ్‌కి సిద్దమైనట్లు కనిపిస్తోంది. దీంతో బిజెపి పవన్‌పై దాడి పెంచింది.తాజాగా ఢిల్లీలో బిజెపి ఎపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ సిద్దార్థ్‌నాథ్‌సింగ్ పవన్‌పై చురకలు వేశాడు. ఆయన మాట్లాడుతూ. కేంద్ర నిధుల గురించి పవన్‌కు తెలిసి ఉండకపోవచ్చు. బహుశా ఆయన సినిమాలు, సినీ పరిశ్రమకు నిధులు నెమ్మదిగా వస్తూ ఉండొచ్చు. కేంద్రం నుంచి ఏపీకి నిధులు మాత్రం అవసరమైన మేరకు వెళ్తున్నాయంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్రత్యేకప్యాకేజీపై పవన్ మరింతగా అధ్యయనం చేయాలని, ఒకవేళ విమర్శలు చేయాలనుకుంటే ముందుగా తన పరిజ్జానాన్ని పెంపొందించుకొని చేయాలని సూచించాడు. అంతేగానీ విమర్శలు చేయాలని భావించి, దాన్నే పనిగట్టుకొని అవగాహన లేని విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రత్యేకహోదా కంటే ప్రత్యేకప్యాకేజీలోనే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని తేల్చిచెప్పారు. దీంతో పవన్ విషయంలో ఇక ఉపేక్షించకూడదని బిజెపి భావిస్తోందని, తమపై విమర్శలు చేసినందుకు పవన్‌ను కూడా వదిలిపెట్టకూడదని నిర్ణయించుకుందని అర్దమవుతోంది.