చైతూకు మొదటి హిట్ ఇచ్చిన 'ఏ మాయ చేశావే' చిత్రం ఘనవిజయం సాధించి చైతూ కెరీర్‌లో మొదటి హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత '100% లవ్'.. కాస్త గ్యాప్ తర్వాత ఆయన సునీల్‌తో కలిసి నటించిన 'తడాఖా' చిత్రం కూడా మంచి విజయాన్నే సాధించాయి. ఆ తర్వాత వచ్చిన వరుస ఫ్లాప్‌ల తర్వాత నాగచైతన్య చేసిన మలయళ సూపర్‌హిట్ రీమేక్ 'ప్రేమమ్' కూడా సోలో హీరోగా ఆయన కెరీర్‌లో గుర్తుండిపోయేచిత్రంగా నిలిచింది. తాజాగా ఆయన చేసిన 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం చైతూ అభిమానులను కూడా నిరుత్సాహపరిచింది. ఈ చిత్రాన్ని తాను అనుకున్నట్లు తీయలేకపోయానని ఈ చిత్ర దర్శకుడు గౌతమ్‌మీనన్ కూడా నిజాన్ని నిర్భయంగా వెల్లడించాడు. ఇలా జరగడానికి ఈ చిత్ర దర్శకుడు గౌతమ్ కేవలం ఈ చిత్ర కథను తమిళ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని, వారి అభిరుచికి దగ్గరగా, శింబుకు తగ్గట్లుగా స్క్రిప్ట్‌ను తయారు చేయడమే కారణమని చైతూ నమ్ముతున్నాడు. ఇలా గౌతమ్‌మీనన్ తనతో తీసిన చిత్రాలలాగా చేస్తే తాను తన అభిమానులను నిరుత్సాహపరిచినట్లు అవుతుందని, ఇకపై ద్విభాషా చిత్రాలను ఒప్పుకోవడం, రీమేక్ చిత్రాలను తీసి విజయం సాధించినా తనకు ఒక ప్రత్యేక ఇమేజ్ రాదని భావిస్తున్నాడట.
అలాగని ద్విభాషా చిత్రాలలో రెండు భాషల్లో తానే నటించడం కూడా ఆయనకు ఇష్టం లేదంటున్నారు. తనకు ప్రస్తుతానికి తెలుగులో నిలదొక్కుకుంటే చాలని ఆయన భావిస్తున్నాడు. ఇక రీమేక్ చిత్రాలను చేస్తూ పోతే తన మేనమామ విక్టరీ వెంకటేష్‌లా రీమేక్ చిత్రాల స్పెషలిస్ట్ అని ముద్ర పడుతుందని ఆయన ఆందోళన చెందుతున్నాడు. అందుకే ఆయన తమిళంలో కొన్ని నెలల కిందట విడుదలై ఘనవిజయం సాధించిన తమిళ చిత్రం 'మెట్రో' చిత్రాన్ని మొదట రీమేక్ చేయాలని భావించినప్పటికీ ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నాడని తెలుస్తోంది. అందుకే తన తండ్రితో 'సోగ్గాడే చిన్నినాయనా' వంటి అచ్చమైన తెలుగు చిత్రాన్ని తీసి సంచలనం సృష్టించిన కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. తెలుగులో స్దిరపడిన తర్వాతే మరలా అలాంటి చిత్రాలు చేయాలని నిర్ణయించుకున్నాడట. కాగా ప్రస్తుతం 'మెట్రో' చిత్రాన్ని డబ్బింగ్ చిత్రాల నిర్మాత సురేష్ కొండేటి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తమిళంలో చూసిన వారు మాత్రం సురేష్‌కొండేటి జాక్‌పాట్ కొట్టాడంటున్నారు.