చాలా గ్యాప్ తర్వాత తన కెరీర్‌లోనే 'జనతాగ్యారేజ్' చిత్రం ద్వారా బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్న యంగ్‌టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రంపై ఇంకా కన్‌ఫ్యూజన్ తొలగలేదు. 'జనతాగ్యారేజ్' విడుదలై హిట్టయిన తర్వాత ఆయన పార్టీ మూడ్‌లోకి వెళ్లిపోయాడు. ఈ గ్యాప్‌ను ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. దీంతో ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఏ దర్శకుడికి అవకాశం ఇస్తాడు అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. తెరపైకి రోజుకో దర్శకుడి పేరు వినిపిస్తోంది. వక్కంతం వంశీకి డైరెక్టర్ గా మొదటి ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇక 'ఇజం' ఫలితంతో పూరీకి కూడా ద్వారాలు మూసుకుపోయాయి. ఇక రాజమౌళితో చేస్తాడని, వినాయక్‌తో 'అదుర్స్' సీక్వెల్ చిత్రం చేస్తాడనే వార్తలు కూడా గాసిప్ అంటున్నారు. ఇక 'పటాస్' ఫేమ్ అనిల్ రావిపూడి పేరు మాత్రం ఇంకా పరిశీలనలో ఉందంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. తనపై ఎన్టీఆర్‌కు నమ్మకం కుదిరేలా చేయగలిగితే మాత్రం అనిల్ రావిపూడికి ఇంకా ఆశలు సజీవంగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.
కాగా ఎన్టీఆర్ తన తదుపరి చిత్రంగా ఓ పక్కా మాస్ అండ్ యాక్షన్ చిత్రం చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నాడని విశ్వసనీయ సమాచారం. ఇందుకోసం ఆయన తమిళ దర్శకుడు హరి దర్శకత్వంలో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మాస్ అండ్ పక్కా యాక్షన్ చిత్రాలు తీయడంలో హరి సిద్దహస్తుడు. ఆయన తీసిన 'సింగం, సింగం౨' చిత్రాలు స్టార్‌గా సూర్యకు జీవం పోసి, మాస్‌లో కూడా ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. కాగా 'సింగం2' తర్వాత సరైన హిట్ కొట్టలేకపోయిన సూర్య మరోసారి హరితో 'సింగంత్రీ' చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'ఎస్2' అనే టైటిల్‌ను నిర్ణయించారు. వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీన్ని డిసెంబర్ 16న విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు. దాంతో హరి ఫ్రీ అవుతాడు. కాబట్టి హరి దర్శకత్వంలో చేయాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నాడని, అందుకే ఇప్పటికీ ఈ విషయాన్ని బయటపెట్టలేదని అంటున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే గతంలోనే హరి తెలుగులో భారీ మాస్‌ఇమేజ్ ఉన్న బాలయ్యకు ఓ స్టోరీ చెప్పాడు. కానీ ఆ చిత్రం పట్టాలెక్కలేదు. అదే సమయంలో ఆయన ఎన్టీఆర్‌కు కూడా ఓ స్టోరీ చెప్పాడని, ఎన్టీఆర్ మాత్రం ఆసక్తి చూపలేదని అంటున్నారు. ప్రస్తుతం గ్యాప్‌లో ఉన్న ఎన్టీఆర్ పలు వేడుకలకు పలు పలు గెటప్‌లతో వస్తున్నాడు. దీంతో ఆయా గెటప్‌లను బట్టి మన ఔత్సాహిక జర్నలిస్ట్‌లు ఒక్కో దర్శకుడి పేరు తెరపైకి తెస్తున్నారని, ఇటీవల కోరమీసంతో కనిపించడంతో హరి పేరు తెరపైకి వచ్చిందనే వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఎన్టీఆర్ మరెంత కాలం అందరినీ సస్పెన్స్‌లో ఉంచుతాడో వేచిచూడాల్సివుంది...!