తమిళంలో అతి తక్కువకాలంలోనే సాధారణ యాంకర్‌గా చేసి స్టార్‌డమ్ తెచ్చుకున్న యంగ్‌స్టార్ ఒకరైతే, మరొకరు తెలుగులో రవితేజలాగా దాదాపు జూనియర్ ఆర్టిస్ట్‌లాగే చిన్న చిన్న పాత్రలు వేస్తూ హీరోగా మారి నేడు స్టార్‌గా ఎదిగిన వారు మరొకరు. ఈ ఇద్డరు ఎవ్వరి అండదండలు లేకుండా యంగ్‌స్టార్స్‌గా ఎదిగి, తమిళ సీనియర్ స్టార్స్ గుండెల్లో గుబులు రేపుతున్నారు. వారిద్దరే శివకార్తికేయన్, విజయ్ సేతుపతి. కాగా వీరు నటించిన కొన్ని చిత్రాలు ఇప్పటికే తెలుగులో డబ్ అయ్యాయి. కానీ అవి ఎప్పుడు వచ్చాయో.. ఎప్పుడు పోయాయో కూడా తెలియదు. దాంతో వారు నిరుత్సాహానికిలోనై టాలీవుడ్‌పై ఆశలు వదులుకున్నారు. కానీ తమిళంలో కూడా పెద్దగా పేరులేని సంగీత దర్శకుడు విజయ్‌ఆంటోని 'బిచ్చగాడు'తో తెలుగులో రికార్డులు సృష్టించాడు. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరు యంగ్‌స్టార్స్ 'బిచ్చగాడు'ను, విజయ్‌ఆంటోనిని స్ఫూర్తిగా తీసుకున్నారు. దాంతో త్వరలో కొందరి అండతో తెలుగులో వారు మరలా వచ్చి ఇక్కడ కూడా క్రేజ్ సాధించాలని నిర్ణయించుకున్నారు. శివకార్తికేయన్ విషయానికి వస్తే ఆయన నటిస్తున్న 'రెమో' చిత్రం త్వరలో తెలుగులో విడుదల కానుంది. ఈ చిత్రంలో ఇక్కడ టాలీవుడ్‌లో కూడా 'నేను..శైలజ'తో మంచి గుర్తింపు సాధించిన కీర్తిసురేష్‌ను వెంటపెట్టుకొస్తున్నాడు. మరో పక్క ఈ చిత్రం తెలుగు అనువాద హక్కులను దిల్‌రాజుకు ఇచ్చాడు. దీంతో ఈ చిత్రానికి మంచి క్రేజ్ వస్తుందని, దిల్‌రాజు, కీర్తిసురేష్‌ల అండతో తాను తెలుగులో కూడా ఎవ్వరూ ఊహించని సక్సెస్‌ను సాధిస్తానని ఎంతో నమ్మకంతో ఉన్నాడు. ఇక విజయ్‌సేతుపతి కూడా తమిళంలో మంచి విజయం సాధించిన తన చిత్రం 'ధర్మదురై'ని తెలుగులో 'డాక్టర్ ధర్మరాజు ఎంబిబియస్'గా తెస్తున్నాడు. ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించింది. తమిళంతో పాటు తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉన్న తమన్నా ఇందులో నటించడం తనకు ప్లస్ అవుతుందని, ఆమె అండతో తెలుగులో నెగ్గుకురావాలని సేతుపతి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాడు. మరి ఈ ఇద్దరు టాలెంటెడ్ ఆర్టిస్టులు తెలుగులో ఏమాత్రం గుర్తింపు తెచ్చుకుంటారో వేచిచూడాలి.. వీలుంటే ఈ చిత్రాలు విడుదల కాకముందే వీరు నటించిన పాత చిత్రాలను ముందుగానే డబ్బింగ్ హక్కులు తక్కువ రేటుకు లభిస్తాయి కనుక ఈ విషయంపై కొందరు డబ్బింగ్ చిత్రాల చిన్నచితకా నిర్మాతలు ముందస్తుగా కన్నేశారు.