దర్శకుడు సుకుమార్ అంటే సామాన్య మాస్ ప్రేక్షకులకు చాలా భయం. తమకు అర్దం కాని లెక్కలతో, మనకు పరిచయం లేని స్క్రీన్‌ప్లేతో ఆయన సామాన్యులను బెంబేలెత్తించి సామాన్య ప్రేక్షకుల ఐక్యూని పరీక్షించి, వారి ఆలోచనా శక్తిని పెంచాలని ట్రై చేస్తుంటాడు. పూర్వాశ్రమంలో లెక్కల మాష్టారిగా పనిచేసి, పనిలో పనిగా దానికి అనుసంధానమైన సైన్స్‌పై కూడా పట్టు సాధించిన సుక్కు తన చిత్రాలలో తనకున్న పరిజ్ఞానాన్ని చూపుతుంటాడు. ఇప్పటివరకు సుక్కు చేసిన చిత్రాలన్నీ ఈ కోవకు చెందినవే. కాగా ప్రస్తుతం స్టార్‌హీరోల నిర్ణయాలు మారుతున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి, దేశ విదేశాలలో మార్కెట్ సంపాదించుకోవాలని, మల్టీప్లెక్స్, 'ఏ' సెంటర్ ఆడియన్స్‌ను కూడా మెప్పించాలని మాస్ మంత్రం జపించే స్టార్స్ కూడా ఆరాటపడుతున్నారు. దీంతో వారు సుక్కు చిత్రాలలో చేయాలని, విమర్శకుల, మేథావుల ప్రశంసలు కూడా పొందాలని ఉబలాటపడుతున్నారు. దాంతో సుక్కుకు కూడా ఎక్కడలేని డిమాండ్ ఏర్పడుతోంది. అయితే ఆయన దర్శకత్వం వహించే ప్రతి చిత్రం షూటింగ్ మొదలయ్యే సమయంలో, చివరకు సినిమా రిలీజ్ అయ్యే ముందు జరిగే ప్రమోషన్స్‌లో కూడా తన చిత్రం చాలా సింపుల్‌గా ఉంటుందని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని, హీరోల ఇమేజ్‌ను అనుసరించే తను చిత్రాన్ని తీశానని చెపుతుంటాడు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఆయన మాటలపై నమ్మకంతో చిత్రానికి వెళ్లిన సామాన్య ప్రేక్షకులు ఆయన మాట విని మోసపోయామని, సినిమా అసలు అర్థం కాలేదంటూ బాదపడుతుంటారు. ఇక ఆయన ఈమద్య మరింత విజృంభిస్తూ, '1' (నేనొక్కడినే),'నాన్నకు ప్రేమతో' చిత్రాలలో తన గణిత కోణాలు, డిగ్రీల లెక్కలు చెప్పడం, మనకు తెలియని స్క్రీన్‌ప్లేతో ఇబ్బంది పెట్టడం పరాకాష్టకు చేరుకుంది. '1' (నేనొక్కడినే) స్క్రీన్‌ప్లేతో, 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో డిగ్రీలు (కోణాలు) గోలను మరింతగా పెంచి పీక్స్‌కు చేరాడు.
కాగా సుకుమార్ డైరెక్షన్‌లో కేవలం మాస్ ప్రేక్షకుల అండ మాత్రమే ఉన్న, మూస చిత్రాలు చేస్తాడని చెడ్డపేరు తెచ్చుకున్న రామ్‌చరణ్ విభిన్న చిత్రం చేసి అందరికీ చేరువకావాలని నిర్ణయించుకున్నాడు. ఈ చిత్రం పక్కా స్క్రిప్ట్ పనులు సుక్కు ఎప్పుడో మొదలుపెట్టేశాడు. కాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ చెర్రీతో తాను చేసే చిత్రం సింపుల్‌గా ఉండి అందరి మన్ననలు పొందే విధంగా ఉంటుందని హామీ ఇచ్చాడు. మరోపక్క రామచరణ్ చిత్రం ఓ హృద్యమైన గ్రామీణ నేపథ్యంలో 1980ల నాటికాలంలో సాగే ప్రేమకథా చిత్రమని, కాదు... కాదు... ఈ చిత్రం ఓ సైన్స్ ఫిక్షన్ అని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికీ సందిగ్దత నెలకొని ఉంది. ఇంకా క్లారిటీ లేదు. సింపుల్ లవ్‌స్టోరీ అనే మాటే నిజమైతే చరణ్ అభిమానులు ఆనందించాల్సిందే. అదే సైన్స్‌ఫిక్షన్ చిత్రమైతే మాత్రం చరణ్ నుండి మాస్ చిత్రాలను ఆశించే ఆయనకున్న మాస్ చిత్రాల వీరాభిమానులకు మరోసారి భంగపాటు ఎదురవుతుంది. మరి ఈ సారైనా ఓ సింపుల్ లవ్‌స్టోరీని తీస్తేనే అందరికీ నచ్చే చిత్రమవుతుందనే సుక్కు మాటలు నిజమవుతాయి. కానీ సైన్స్‌ఫిక్షన్ చిత్రమైతే మరోసారి సుక్కు మాట తప్పినట్లు అవుతుంది. కానీ ఈమధ్య సోషల్ మీడియాలో ఈ చిత్రం టైటిల్స్ అని రెండు వెరైటీ టైటిల్స్ హల్‌చల్ చేశాయి. ఆ టైటిల్స్ నిజమైతే మాత్రం చరణ్‌తో సుక్కు తీయబోయేది సైన్స్‌ఫిక్షనే అని అర్దమవుతోంది. మరి ఈ చిత్రం స్టోరీపై మాత్రం ఊహాగానాలే తప్ప ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం రాలేదు.