ప్రస్తుతం అన్ని వుడ్‌లలోని చిత్రాలకు ఓవర్‌సీస్ మార్కెట్ అనేది కీలకంగా మారింది. టాలీవుడ్‌లో అయితే సెకండ్ నైజాంలా వెలుగొందుతోంది. కాగా ఏ భాషా చిత్రాలైనా ఇప్పుడు ఓవర్‌సీస్‌లో విడుదల కావడం కంపల్సరీ అయింది. దేశాన్ని బట్టి అక్కడికి, భారత్‌కు ఉన్న కాలమాన వ్యత్యాసంలో భాగంగా ఓవర్‌సీస్‌లోని చిత్రాలు ఎక్కువగా ఓ రోజు ముందుగానే ఓవర్‌సీస్‌లో రిలీజ్ అవుతుంటాయి. కానీ ఆయా చిత్రాల ఒరిజినల్ వెర్షన్ స్వంత ప్రదేశంలో ప్రదర్శించడానికి ముందుగానే ఓవర్‌సీస్‌లో కొన్ని గంటల వ్యవధిలోనే ఈ చిత్రాలు విడుదలైనప్పటికీ సోషల్ మీడియా పుణ్యమా.. కమ్యూనికేషన్ రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పుల వల్ల ఆ చిత్రం ఎలా ఉంది? రివ్యూలు ఎలా ఉన్నాయి? మౌత్ టాక్ ఏమిటి? అనే సంగతులు చిత్రం విడుదలకు కొద్ది వ్యవధి ముందే మన దేశంలోని వారికి తెలిసిపోయి దాని ఎఫెక్ట్ స్వదేశీ మార్కెట్ మీద విపరీతంగా పడుతోంది. గతంలో కొన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిన లోబడ్జెట్ చిత్రాలు మన దేశంలో కంటే విదేశాల్లో చాలా రోజుల ముందే విడుదలై ఘనవిజయం సాధించి, తద్వారా స్వదేశంలో కూడా ఎందరినో ముందుగానే ఆకర్షించి ఆ చిత్రం విడుదల కోసం స్వదేశంలోని వారు ఎదురుచూసే విధంగా చేసి విజయాలను సాధించిన సంగతి తెలిసిందే. అయితే అలా విడుదలైన చిత్రాలు ఆయా దర్శకులకు, నిర్మాతలకు ఓవర్‌సీస్‌లో ఉన్న క్రేజ్ మూలంగానే ధైర్యంగా అలా విడుదలకు నోచుకున్నాయి. కానీ ఈ ఫార్ములా ప్రయోగాలు కేవలం లోబడ్జెట్ చిత్రాలకైతే పెద్దగా రిస్క్ అనిపించదు. కానీ స్టార్స్ చిత్రాలు మాత్రం అలా మన దేశంలో కంటే ముందుగానే విదేశాల్లో రిలీజ్ చేయడం అనేది సాహసం. భారీ బడ్జెట్‌తో నిర్మించే స్టార్స్ చిత్రాల మౌత్‌టాక్, రివ్యూలలో ఏమాత్రం తేడా వచ్చినా, స్వదేశంలో ఇక ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు కాదు కదా.. ఎగ్జిబిటర్లు కూడా ముందుకు రారు. అందుకే ఈ తరహా ప్రయోగాలకు స్టార్స్ దూరంగా ఉంటూ వచ్చారు. ముఖ్యంగా ఇలా ముందుగా విడుదల చేయడమనేది పైరసీ వ్యవహారంలో కూడా చాలా రిస్క్. సినిమా రిలీజ్ అయిన గంటల్లో ఆయా చిత్రాల పైరసీ జరిగిపోతోంది. సిడిల్లోనే కాదు.. నెట్‌లో కూడా వీటిని అందరు చూసే టెక్నాలజీ అందుబాటులో ఉంది.
ఇక ఇక్కడ మరో విషయం కూడా ప్రస్తావించాలి. అనేక హాలీవుడ్ చిత్రాలు విదేశాల్లో కంటే భారత్‌లో చాలా ముందుగానే రిలీజ్ అవుతున్నాయి. కానీ ఈ విషయంలో హాలీవుడ్ చిత్రాలకు కొంత వెసులుబాటు ఉంది. అలా విడుదల చేయడం మన స్టార్స్ కనీసం ఊహించలేని పరిస్థితి ఉంది. దాంతో ఈ తరహా ప్రయోగాలకు మన స్టార్స్ దూరంగా ఉంటున్నారు. అయితే టెక్నాలజీ విషయంలో, గ్రాఫిక్స్ విషయంలో, కథల విషయంలో, యాక్షన్ సీక్వెన్స్‌ల విషయంలో మన స్టార్స్ హాలీవుడ్‌ని ఫాలో అవుతున్నారు. చివరకు హాలీవుడ్ చిత్రాలను మన దేశంలో ఓ వారం ముందుగా విడుదల చేసినట్లుగా తన చిత్రాన్ని కూడా ఓవర్‌సీస్‌లో రెండు రోజులు ముందుగా రిలీజ్ చేయాలని ఓ బాలీవుడ్ స్టార్ ప్రయోగం చేస్తున్నాడు. అది మరెవ్వరో కాదు...... బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్.
ఇటీవల వరుస ఫ్లాప్‌లలో ఉన్న ఆయన ఇంతటి డేర్ డెసిషన్ ఎందుకు? ఎవరి సలహా తీసుకొని? ఇలా చేస్తున్నాడో తెలియదు కానీ మొత్తానికి అనుకున్నంత చేసే పనిలో ఆయన నిమగ్నమై ఉన్నాడు. వరస పరాజయాల్లో ఉన్న షార్‌ఖ్‌కు ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా క్రేజ్ తగ్గింది. కాగా ఇటీవల మోదీని, బిజెపిని ఉద్దేశించి ఆయన ఇన్‌డైరెక్ట్‌గా కొన్ని బాధాకర వ్యాఖ్యలు చేసి, దేశం పరువు తీశాడు. దీనిపై దేశంలోనే గాక ఓవర్‌సీస్‌లో కూడా ఆయనపై ప్రవాస భారతీయులు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ఆయన చిత్రాలను కొందరు చూడటం త్యాగం చేశారు. దీంతో ఆయన ఇటీవల చేసిన కొన్ని చిత్రాలు అనుకున్నస్థాయిలో కలెక్షన్లు రాబట్టలేదు. దాంతో ఆయన ఎవరికి తెలియకుండా, ఎంతో సీక్రెట్‌గా గౌరీషిండే దర్శకత్వంలో 'డియర్ జిందగీ' చిత్రం చేశాడు. ఇందులో అలియాభట్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ఎప్పుడు మొదలైందో, ఎవ్పుడు పూర్తయిందో మీడియాకు కూడా తెలియదు. కేవలం ప్రమోషన్ మొదలు పెట్టిన తర్వాతే ఈ చిత్రం విషయం అందరికీ తెలిసింది. ఈ చిత్రం చాలా లో బడ్జెట్‌లో రూపొందిందని సమాచారం. దాంతో భారీ బడ్జెట్ కాకపోవడంతో ఈ చిత్రాన్ని రెండు రోజులు ముందుగా ఓవర్‌సీస్‌లో రిలీజ్ చేయాలని నిర్ణయించాడు. దేశంలో నవంబర్25న విడుదల కానున్న ఈ చిత్రం ఓవర్‌సీస్‌లో నవంబర్ 23నే విడుదల కానుంది. మొత్తానికి తన ఇమేజ్‌ను, క్రేజ్‌ను పణంగా పెట్టి షారుఖ్‌లాంటి స్టార్ ఈ ప్రయోగానికి ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం దేశ, విదేశాల్లో ఘన విజయం సాధిస్తే మాత్రం భవిష్యత్తులో మిగిలిన స్టార్స్ కూడా ఆయన బాటలో నడచే అవకాశం ఉంది. అయినా ఇక్కడ లో బడ్జెట్‌లో నిర్మించడం అనేది ఈ ప్రయోగానికి షారుఖ్‌ను పూనుకునేలా చేసిందని చెప్పాలి.