జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో తెలుగుదేశం పార్టీ చాలా మెలకువతో వ్యవహరిస్తుంది. పవన్ తో పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది అనుకున్నారో ఏమో గానీ... పవన్ అనంతపురం సభ తర్వాత తెదేపా ఏమాత్రం స్పందించలేదంటే ఆశ్చర్యమేస్తుంది. ముఖ్యంగా అనంతపురం బహిరంగ సభ సాక్షిగా పవన్ కళ్యాణ్ తెదేపా పాలనలోని లొసుగులను ఎత్తిచూపాడు. ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలనా విధానాన్ని మార్చుకోవాలని కోరాడు. ఇంకా బాబు సర్కారులో అవినీతి విచ్చలవిడుగా మారుతుందని వెల్లడించాడు. ఇంకాస్త ముందుకుపోయి ఒక సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని పవన్ వెల్లడించాడు. అయితే సింగపూర్ తరహా రాజధాని అమరావతి, ఇక్కడ రాజధాని పేరుతో నాయకులు చేస్తున్న దందా గురించి పవన్ ప్రస్తావించాడు.
కాగా పవన్ చేసిన వ్యాఖ్యలకు తెదేపా నాయకులు చాలా ఆచితూచి స్పందిస్తున్నారు. ముఖ్యంగా పవన్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా స్పందిస్తాడోనని అందరూ భావించారు. ఎందుకంటే... పవన్ తెదేపాపై చాలా ఘాటుగా దుమారం రేపే వ్యాఖ్యలే చేశాడనే చెప్పవచ్చు. ఎందుకంటే.. పవన్ చాలా భావావేశంతో.. సామాజిక వర్గ తారతమ్యాలు, ప్రభుత్వం చేస్తున్న అవినీతి, ప్రాంతీయ అసమానతలు వీటన్నింటిపై ప్రభుత్వం చేస్తున్న నిర్వాహంపై చురకలు అంటించాడు. కాగా పవన్ చేసిన విమర్శలపై చంద్రబాబు పరోక్షంగా సమాధానం చెప్పేశాడు.
అయితే శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..ఏపీలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. దానికి ప్రభుత్వ నిస్పక్షపాత పాలన, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణమన్నాడు. ఇంకా రాష్ట్రంలో పెద్ద ఎత్తున రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాలు, రైల్వేలు అభివృద్ధి చేస్తున్నామన్నాడు. ప్రజలకు అవినీతి రహిత పాలన అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నాడు. ఎలాంటి ఆర్థిక అసమానతలు లేకుండా అభివృద్ధి జరుపుతున్నామన్నాడు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యతనిస్తున్నామన్నాడు. ఇంకా ఎటువంటి వనరులు లేని హైదరాబాద్‌ను అంతగా అభివృద్ధి చేసినప్పుడు, ఎన్నోరకాలుగా వనరులు ఉన్న ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయడం అంత కష్టమేం కాదని బాబు వివరించాడు. కాగా కొంతమంది కావాలనే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారనీ, వారు చేసే విమర్శలో మంచి వుంటే వాటిని కచ్చితంగా ఆచరిస్తామని బాబు చెప్పేశాడు. అయితే పవన్ విడిచిన విమర్శనాస్త్రాలకు ఒక్క మీటింగ్ లోనే బాబు పరోక్షంగా బాగానే సమాధానం చెప్పినట్లయింది. బాబు సభకు హాజరైన వారంతా ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించకుండా పవన్ కు బాబు బాగానే సమాధానం చెప్పాడే.. అంటూ గుసగుసలాడుకుంటున్నారు. దీన్ని బట్టి పవన్ పట్ల బాబు నొప్పించక తానొవ్వక అలా అలా ప్రతిస్పందిస్తూ తప్పించుకు తిరుగుతున్నాడన్నమాట.