టాలీవుడ్ నెంబర్‌వన్ రేసులో పవన్, మహేష్‌లు నువ్వా? నేేనా? అన్నట్లు పోటీపడుతుంటారు. తమ హీరోనే నెంబర్‌వన్ అని తమ హీరో తీసుకునే రెమ్యూనరేషనే ఎక్కువ కాబట్టి తమ హీరోదే ఆ స్థానం అని చెబూతూ వారి ఫ్యాన్స్ ఎన్నో రకాల పోలికలను తెరపైకి తెస్తుంటారు. ఇక తమ హీరో చిత్రమే ఎక్కువ కలెక్ట్ చేసింది.. చరిత్ర సృష్టించిందని, ఇక తమ హీరోనే వరుస విజయాలను అందిస్తున్నాడని, తమ హీరోకే సినిమాయేతర అవకాశాలు అంటే కమర్షియల్ యాడ్స్ వంటివి ఎక్కువని, తమ హీరోకే కేవలం తెలుగులోనే గాక ఇతర భాషల్లో కూడా ఎక్కువ క్రేజ్ ఉందనే వాదనలను వారు ఆధారం చేసుకుంటూ వస్తున్నారు. ఇక అభిమానుల పోలికల్లో ఎన్ని లెక్కలు ఉన్నప్పటికీ పవన్, మహేష్‌లలో ఎవరు నటించిన చిత్రం ఫ్లాప్ అయినా, మరో హీరోది హిట్ అయినా కూడా అంటే కేవలం ఒకే ఒక్క విజయం, ఒకే ఒక్క పరాజయం కూడా వారి స్దానాలను మారుస్తూ వస్తున్నాయనేది అక్షరసత్యం. దీంతో చిత్ర చిత్రానికి వీరి స్దానాల్లో మార్పులు చోటు చేసుకుంటూ, ఎవరి చిత్రం హిట్టయితే వారే తదుపరి చిత్రం దాకా నెంబర్‌వన్‌గా చెలామణి అవుతున్నారు. ఇలా ఈ ఇద్దరి హీరోల మధ్య కుర్చీలాట జరుగుతుంటే మరోపక్క పవన్, మహేష్‌లు మాత్రం ఒకే దారిలో నడుస్తున్నారు. ఇద్దరు ఎక్కువ మాట్లాడరు. ఇద్దరికి వారసత్వం అండగా ఉంటూ వచ్చింది. ఇద్దరు వివాదస్పద వ్యక్తులు కాదు. కానీ ఇటీవల పవన్ రాజకీయాలలోకి వచ్చి, ఇతరులను దుమ్మెత్తిపోస్తుండే సరికి పవన్ మాత్రం ఇటీవలే వివాదాస్పద వ్యక్తిగా మారుతున్నాడు. ఇక ఈ ఇద్దరు తమ కెరీర్‌ను ఎంతో నిదానంగా నడిపిస్తూ, ఆచితూచి చిత్రాలు చేస్తూ వస్తున్నారు. వారి కెరీర్‌లో చేసిన సినిమాలు కూడా దాదాపు దగ్గరదగ్గరగానే ఉంటాయి. ఇక ఇద్దరు కూడా మితభాషులే. సిగ్గెక్కువ, మీడియా ముందు మాట్లాడటానికి కూడా మొహమాటపడుతుంటారు. ఇలా దగ్గరి పోలికలున్న ఈ ఇద్దరుస్టార్‌లు ప్రస్తుతం ఒకే సమయంలో తమ కెరీర్‌లో ఎప్పుడు లేని విధంగా ఒక చిత్రం పూర్తికాకుండానే మరో చిత్రానికి ఓకే చెబుతూ అభిమానులను ఆనందంతో ముంచెత్తుతున్నారు. విశ్లేషకులను ఆశ్యర్యపరుస్తున్నారు.
పవన్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, తాను స్దాపించిన జనసేన పార్టీ తరపున ఇతర అభ్యర్దులను కూడా దాదాపు రాష్ట్రంలోని బలం బాగా ఉన్న చోట్ల పోటీకి నిలుపుతానని ప్రకటించాడు. దీంతో ఈయన 2019 ఎన్నికలలోపు అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో బిజీ అయ్యేలోపే వీలైనన్ని ఎక్కువ చిత్రాలను చేయాలని నిర్ణయించుకున్నాడనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే మహేష్ కూడా స్పీడు పెంచడానికి కారణం వీలైనన్ని ఎక్కువ చిత్రాలు చేసి అభిమానులకు ఆనందం పంచాలనే ఉద్దేశ్యమా? లేక మంచి దర్శకులు, కథలు, నిర్మాణ సంస్ధలు దొరికాయనే నమ్మకమా? అనేది స్పష్టంగా తెలీదు. మరి పవన్ రాజకీయాల్లోకి వెళ్లిపోయిన తర్వాత కూడా ఆయన భవిష్యత్తులో ఇలాగే రెండు మూడు చిత్రాలు చేయడానికి నిర్ణయించుకున్నాడా? అనేవి సమాధానం లేని ప్రశ్నలు. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే.. ఇప్పుడు పవన్, మహేష్ ఇద్దరూ ఖచ్చితంగా మూడు మూడు చిత్రాలకే అంటే లెక్కలో కూడా పొరపాటు రాకుండా సమానంగా ఒప్పుకున్నారు. పవన్ విషయానికి వస్తే ఆయన నటిస్తున్న 'కాటమరాయుడు' చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇదే సమయంలో ఆయన ఎ.యం.రత్నం-నీసన్‌ల కాంబినేషన్‌లో 'వేదాళం' రీమేక్‌నే కాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ - హారిక హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ నిర్మించే చిత్రానికి ముహూర్తాలు జరిపించేశాడు. ఇక ఇవి పట్టాలెక్కడమే తరువాయి. ఇక మహేష్ విషయానికి వస్తే ఆయన మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న ద్విభాషా చిత్రం షూటింగ్ కూడా వేగంగా జరుగుతోంది. ఇక డి.వి.వి.దానయ్య నిర్మాతగా 'శ్రీమంతుడు' దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే చిత్రం ఆల్‌రెడీ ముహూర్తం జరుపుకొంది. మరోవైపు పివిపి బేనర్‌లో ఆయన వంశీపైడిపల్లి చిత్రం కూడా కన్‌ఫర్మ్ చేశాడు. పివిపి మాట్లాడుతూ ఈచిత్రం స్క్రిప్ట్ వర్క్‌ను కూడా విజయదశమి కానుకగా పూజా కార్యక్రమాలు జరిపి ప్రారంభించామని మీడియా ముఖంగా ప్రకటించాడు. అంటే ఈ చిత్రం కూడా లాంఛనంగా ముహూర్తం జరుపుకున్నట్లే భావించాలి.
ఇక ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ ఇద్దరు స్టార్స్ తమ మూడు చిత్రాలలో ఒకదానిని రాజకీయాల నేపథ్యంలో చేయనున్నారు. పవన్‌కళ్యాణ్.. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయబోయే చిత్రం రాజకీయ నేపథ్యంలో ఓ ఆదర్శ రాజకీయనాయకుడు ఎలా పుడతాడు? ఎలాంటి ప్రజా పోరాటాలు చేసి ఆయన నాయకుడిగా ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నాడనే కథాంశంతో రూపొందనుందని టాలీవుడ్ సమాచారం. ఇక 'శ్రీమంతుడు' లో గ్రామాల దత్తత గురించి చూపించి, 'జనతా గ్యారేజ్'లో హరితవిప్లవాన్ని జనరంజకంగా మలిచిన కొరటాల శివ దర్శకత్వంలో దానయ్యతో కలిసి మహేష్ చేసే చిత్రం కూడా రాజకీయాల నేపథ్యంలో, ప్రజా సమస్యలపై పోరు, ఆదర్శనాయకుడు ఎలా ఉండాలి? వంటి మూలకథతోనే రూపొందనుందని ఇందులో ఆదర్శ రాజకీయనాయకునిగా మహేషే నటిస్తున్నాడని సమాచారం. మరి పవన్, మహేష్‌లు ఇలా ఒకేసారి రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రాలలో నటించడం యాదృచ్చికమే కావచ్చు. కాకపోతే వీరు చేయబోయే రాజకీయ చిత్రాలలో ఎవరు తమ హుందా అయిన నటనతో రాజకీయనాయకుడంటే ఇలా ఉండాలి? అనిపించే విధంగా హుందాగా నటిస్తారు? ఎవరు ఆ పాత్రలకు సూట్ అవుతారు? త్రివిక్రమ్, కొరటాల శివల్లో ఎవరు తమ చిత్రాన్ని చక్కగా తెరకెక్కిస్తారు? అనేవి ఆసక్తిని కలిగిస్తున్నాయి. అయితే ఈ రెండు చిత్రాలలో పవన్ చిత్రమే ఆసక్తిని కలిగిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్ చేయాల్సిన బాధ్యత త్రివిక్రమ్‌పై ఎక్కువగా ఉంది. దానికి కారణం రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్న పవన్‌కే ప్రస్తుతం పొలిటికల్ మైలేజ్‌ను ఇచ్చే చిత్రం అత్యంత ముఖ్యమని చెప్పవచ్చు.