మాస్‌మహారాజాగా క్రేజ్ తెచ్చుకున్న స్టార్ రవితేజ ఈ మద్య వరసగా యువదర్శకులకు అవకాశం ఇస్తానని చెప్పి, అన్నీఒకే అనుకున్న చివరిక్షణాల్లో ఆయన వారికి మొండిచేయి చూపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇది రవితేజకు ఆయన ఒప్పుకున్న దర్శకులు, నిర్మాతలు, ఇతర యూనిట్ పర్సనల్ విషయం.. ఇది కూడా వాస్తవమే. ఇవి వారి వ్యక్తిగత నిర్ణయాలు, వారిని తప్పుపట్టి, ఎందుకు చివరిక్షణంలో ఆపేస్తున్నావు? అని రవితేజను అడిగే దమ్మో లేక మీడియాకు ఎక్కి రవితేజ ప్రవర్తన వల్ల నష్టపోయామని చెప్పినప్పుడు మాత్రమే అది ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యగా మారుతుంది. అందుకే కందకు లేని దురద నీకెందుకనే సామెతను ఉపయోగిస్తున్నారు. కానీ ఇక్కడే అసలు విషయం దాగుంది. ఆయన అనాలోచిత నిర్ణయాల వల్ల ఎందరో యువ దర్శకులు ఆశపడి, చివరకు అవకాశం రాకుండా పోతుంటే.. వారికి ఈ విషయాన్ని మీడియా ముందో లేక అందరి సమక్షంలోనే చెప్పే స్థాయి, స్థోమత, దైర్యం లేక, అలా చెప్పడం వల్ల వారి భవిష్యత్తు నాశనమవుతుందని ఆత్మక్షోభకు గురవుతుంటే మాత్రం ఇలాంటి విషయాల్లో మీడియా స్పందించకపోవడం న్యాయం అనిపించుకోదు. వాస్తవానికి ఓ హీరో కోసం తయారు చేసుకొని, ఆయా హీరోలు తాము చేయమని చెబితే ఆ కథను ఇతర హీరోలకు అనుగుణంగా పలుమార్పులు చేర్పులు చేసి, అదే కథతో వేరేహీరోతో ఆ చిత్రం తీసిన టాలెంటెడ్ దర్శకులు ఎందరో ఉన్నారు. అలా తీసిన చిత్రాలు పెద్ద పెద్ద విజయాలు సాధించిన సందర్భాలు కూడా పుష్కళంగానే ఉన్నాయి.కానీ దర్శక, రచయితలు అంటే సృజనాత్మకత కలిగిన కేటగరీ కిందకు వచ్చేవారు. కేవలం దర్శక, రచయితలు అనే కాదు... కళాకారులందరూ సృజన్మాతక హెచ్చుగా ఉండేవారు. సున్నితమనస్కులు. గతంలో చాలామంది దర్శకులు ఫలానా క్యారెక్టర్ ఫలానా వారే చేయాలని భావించి కథ రాసుకొని, ఆ తర్వాత ఆయా క్యారెక్టర్లను చేయకుండా ఆర్టిస్టులు ముఖం చాటేస్తే ఆయా కథలోని క్యారెక్టర్లలో తాము అనుకున్న వారిని తప్ప వేరే వారిని ఊహించుకోలేక ఆయా కథలను బుట్టదాఖలు చేసిన దర్శకులు ఎందరో ఉన్నారు. ఉదాహరణకు బాలకృష్ణ-నాగార్జునలతో 'గుండమ్మ కథ' చిత్రం చేయాలని దర్శకనిర్మాతలు ఎంతో ప్రయత్నించినప్పటికీ గుండమ్మ పాత్రలో సూర్యకాంతాన్ని కాకుండా వేరే వారిని ఊహించుకోలేని ఆయా దర్శకనిర్మాతలు ఆ చిత్రం రీమేక్‌నే ఆపేశారు. వారే అనుకొని ఉంటే గుండమ్మ క్యారెక్టర్‌కు కొన్ని మార్పులు చేర్పులు చేసి ఏ వాణిశ్రీనో, శారదానో, నగ్మానో, రమ్యకృష్ణనో పెట్టుకుని ఇప్పటికైనా ఈ చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్య వంటి వారితో చేయవచ్చు. కానీ అందుకు ఆ దర్శకనిర్మాతల మనస్సాక్షి అంగీకరించలేదు. అలాగే స్వర్గీయ ఎన్టీఆర్‌ని కృష్ణుడిగా, లేదా రాముడుగా ఊహించుకొని రాసిన పలువురు ఆనాటి రచయితలు, దర్శకులు ఎన్టీఆర్ ఆయా చిత్రాలకు నో చెబితే తమ కథలనే పక్కనపెట్టేశారు. అప్పటికీ వారికి హరనాథ్, శోభన్‌బాబు వంటి ఆప్షన్ ఉన్నా వారు వారికి అవకాశం ఇవ్వలేదు. స్వర్గీయ ఎన్టీఆర్, ఏయన్నార్‌ల కాంబినేషన్‌లో ఓ దర్శకరచయిత ఓ మల్టీస్టారర్ తీయాలని భావించాడు. ఆ చిత్రానికి ఎన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరూ కాల్షీట్స్ అడ్జెస్ట్ చేశారు. కానీ ఎస్వీరంగారావు, సావిత్రిల కోసం తయారు చేసిన క్యారెక్టర్లలో గుమ్మడిని, మరో తలమాసిన హీరోయిన్‌ను తీసుకోవాలని ఎన్టీఆర్, ఏయన్నార్‌లు ఆ దర్శక రచయితలు, నిర్మాతలకు హుకుం జారీ చేశారు. ఎన్టీఆర్, ఏయన్నార్‌లు ఇలా చేస్తున్నారని తెలిసి ముందుగానే ఎస్వీరంగారావు,సావిత్రిలుా ఆ చిత్రాన్ని అంగీకరించలేదు. మీరు మాకోసం పట్టుబడితే వారిద్దరు తమ కాల్షీట్స్‌ను వెనక్కి తీసుకుంటారని, ఇలాంటి బిజీ సమయంలో ఎన్టీఆర్, ఏయన్నార్‌ల ఉమ్మడి కాల్షీట్స్ దొరకడం అదృష్టం కాబట్టి వారు చెప్పినట్లే వెళ్లాలని ఎస్వీఆర్, సావిత్రిలు ఆ నిర్మాత దర్శకుల మంచి కోరి సలహా ఇచ్చినా కూడా ఆయా దర్శకనిర్మాతలు ఎస్వీఆర్, సావిత్రి క్యారెక్టర్లలో వేరే వారిని ఊహించుకోలేక ఎన్టీఆర్, ఏయన్నార్ కాల్షీట్స్‌ను కూడా వదులుకున్నారు. ఇలాంటి దర్శకులు మనకు చరిత్రలో చాలా మంది కనిపిస్తారు. ఒక్కో దర్శకుడికి ఒక్కో హీరోపై గురి ఉంటుంది. దాంతో తమ మొదటి చిత్రానికి కథను ఒక్కో హీరోకు తగ్గట్టుగా తయారుచేసుకుంటున్నారు. ఈ మధ్య మొదటి చిత్రాలకు దర్శకులే రచయితలు కావడంతో ఫలానా హీరోకే తమ దర్శకత్వం సూట్ అవుతుందని భావించి, వారికి తగ్గట్టే రాసుకుంటున్నారు. ఆ చిత్రం కథ నిజంగానే ఆ హీరోకు నచ్చిందంటే పండగే. వారు ఒప్పుకోకపోయినా ముందుగా వేరే కథలతో చిత్రాలు తీసి తమను తాము నిరూపించుకొని, ఆ తర్వాత కావాలంటే తమ అభిమాన హీరో చెప్పే మార్పులు చేర్పులు చేసి ఆయనతోనే ఆ కథను తీస్తారు. కాకపోతే ఇక్కడ మరో రకం దర్శకులు కూడా ఉంటారు. తమకు ఎంత నచ్చినడ్రీమ్ హీరో అయినా కూడా తమకు నచ్చకపోతే వారు చెప్పే మార్పులు కూడా చేయడానికి ఒప్పుకోని దర్శకులు ఉంటారు. గతంలో చాలా మంది ఇలా చేసినవారే. వారు తమ కథతో తీసిన చిత్రం ఒరిజినల్ భాషల్లో హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే ఆ కథ నచ్చి తమ చెంతకు ఇతర భాషల్లో రీమేక్ చేయాలని భావించి వచ్చే వారికి తమ ఒరిజినల్ వెర్షన్‌లో మార్పులు చేర్పులకు కూడా ఒప్పుకోరు. తమకే పరభాషలో డైరెక్టన్ ఛాన్స్ ఇవ్వాలని, తామతైనే ఉన్నది ఉన్నట్లు తీస్తామని బెట్టు చేసేవారు కూడా ఉన్నారు. కాగా ఇలా రవితేజ కోసం కథలు రాసుకొని, ఆయన తమకు అవకాశం ఇస్తానంటే ఓ మంచి కథను తయారుచేసుకొని వెళ్లే యువదర్శకులైన వేణుశ్రీరాం, చక్రి, విక్రమ్‌సిరి, చందుమొంటేటి, సంపత్‌నంది, బాబీలాంటి డైరెక్టర్లను, వారి ఆశలను రవితేజ ఆవిరిచేస్తూ వారిలో ఆశలు కల్పించి మరో హీరోతో పోలేక, ఆయన ఒప్పుకోక తమ భవిష్యత్తులను నాశనం చేసుకొని తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. ఇక్కర రవితేజ చేస్తున్న అన్యాయం ఏమిటంటే..... ఇప్పటికీ వారికి చిత్రాలు చేయను అని చెప్పకుండా కథ నచ్చింది.. ఇంకా బాగా డెవలప్ చేయండి.. చేద్దాం.. చూద్దాం అనే మాటలు చెబుతున్నాడు. మరి దీన్ని వెన్నుపోటు అనాలా? నమ్మకం ద్రోహం అనాలా? అనేది అర్ధం కావడం లేదు. చివరకు బాబి తన సొంత కథపై రవితేజ పెద్దగా ఆసక్తి చూపించడం లేదని భావించి కోనవెంకట్ కథతో, విక్రమ్‌సిరి అనే కొత్త దర్శకుడిని రవితేజ నీకు అనుభవం లేదు కదా..! నీ కథను ఎలా తెరకెక్కిస్తావు? వేరే ఫేమస్ అండ్ ప్రూవ్‌డ్ రైటర్ కథను తీసుకొని రా.. ఈ చిత్రం తెరకెక్కించడంలో ఆ రచయిత సలహా కూడా తీసుకోవాలి అని కండీషన్ పెడితే దానికి కూడా సిద్దపడి వక్కంతం వంశీ కథను రవితేజకు ఇచ్చి, ఈ చిత్రం దర్శకత్వం విషయంలో విక్రమ్‌సిరికి తాను కూడా సహకరిస్తానని వక్కంతం వంశీ చేత రవితేజకు చెప్పించినా ఫలితం రాలేదంటున్నారు. మరి తనకు నచ్చలేదు. లేదా కొంత కాలం నటించను.. ఇలా ముక్కుసూటిగా చెబితే ఏ ప్రాబ్లన్ ఉండదు. అంతేగానీ ఇలా ఆశపెట్టడం, నిర్మాతలను కూడా మీరే ఒప్పించాలని చెప్పి, దర్శకులను కొత్త, పాత, రవితేజతో సినిమాలు చేయాలని భావిస్తున్న వారి చుట్టూ తిప్పి తిప్పి, ప్రీపొడక్షన్ వర్క్ కూడా మొదలు పెట్టించి చివరకు నిర్మాత ఒప్పుకున్న తర్వాత కూడా నిర్మాతలకు కూడా హ్యాండ్ ఇచ్చి, కొందరు ప్యాడింగ్
ఆర్టిస్టుల డేట్స్‌ను తీసుకొనేలా చేసి, వారికి అడ్వాన్స్‌లు కూడా ఇప్పించేంతగా నమ్మించి యూనిట్ మొత్తాన్ని ఆందోళనలోకి, డోలాయమానంలోకి నెట్టే రవితేజకు ఇది స్వంతవిషయం ఎలా అవుతుంది?