ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో పార్టీల మధ్య ఉద్యమాలు ఉధృతంగా నడుస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ నేత జగన్మోహన్‌రెడ్డి యువభేరీ, జై ఆంధ్రప్రదేశ్ వంటి కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజల నోళ్లల్లో నానుతున్నాడు. అంతే స్థాయిలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేస్తున్నారు. ఈ ఇరు పార్టీల లక్ష్యాలు ఒక్కటే. కానీ భావజాల పరంగానే వీరిద్దరిదీ ఎడమొఖం, పెడమొఖం. కానీ వీరిద్దరూ ఒక్క అంశంతోనే పోరాటం సాగిస్తున్నారు. కానీ వీరిద్దరూ ప్రత్యేక హోదా కోసం కలిసిమెలిసి పోరాడుతారా అంటే అదంతా కుదరదు, తన క్రెడిట్ తనదేనంటూ ఇద్దరికి మొండి పట్టుదల ఉంది.
ఇక్కడ ఓ విషయాన్ని గురించి ప్రస్తావిస్తే అనంతపురంలో నీటిశాతం పెంపుదలకు అన్నిపార్టీలు కలిసి ఢిల్లీ పోదామని ప్రకటించిన పవన్.. మరి మంచి కోసం ప్రత్యేక హోదా సాధన కోసం కలిసి ఎందుకు పోరాటం చేయలేక పోతున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి సీపీఐ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సాధన కోసం పోరాడేందుకు పవన్, జగన్‌లు వామపక్షాలతో చేతులు కలిపి, కలగలిసి కార్యాచరణ రూపొందించుకోవాలని ఆయన కోరాడు. కాగా అందుకోసం అవసరమైతే తాను ఇద్దరితో కలిసి మాట్లాడతాననీ, ఐకమత్యంగా పోరాటం చేయడానికి వారిని ఒప్పిస్తానని కూడా అంటున్నారు.
మొత్తానికి రామకృష్ణ కోరిక బాగానే ఉందిగానీ, ప్రత్యేక హోదా అనేది ప్రజలు ప్రాంతం బాగుపడేందుకు చేసే ఉద్యమం కాబట్టి కలిసి చేయవచ్చు గానీ అసలు వీరిద్దరూ కలుస్తారా లేదా అన్నదే ఇక్కడ ప్రశ్న. ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటివరకు..రెండే రెండు ప్రధాన పార్టీలు. ఒకటి తెలుగుదేశం, మరొకటి వైకాపా. కాంగ్రెస్ పార్టీ ఉన్నా లేనట్టుగానే ఉంటుంది. అంటే సుప్తచేతనావస్థలోనే ఉంటుందని చెప్పవచ్చు. కాగా ప్రస్తుతం మూడవ పార్టీగా, ఓ రాజకీయ శక్తిగా జనసేన ఎదిగే అవకాశం కూడా లేకపోలేదు. పవన్ జగన్‌తో కలిసి పోరాడే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు. జగన్ కూడా పవన్ తో కలిసి ప్రత్యేక హోదా కోసం పోరాడే అవకాశం లేనట్లుగా తెలుస్తుంది. కాగా ఈ మధ్య కాలంలో జగన్ సభలకంటే పవన్ బహిరంగ సభలకే ప్రాధాన్యత పెరుగుతుంది. ఇలాంటి సమయంలో మరి పవన్ జగన్ ల కలయిక సాధ్యమా అన్నదే ప్రశ్న. చూద్దాం ఏం జరుగుతుందో.