మాస్ మహరాజు అని ఏ ముహూర్తాన అన్నారో కానీ రవితేజ ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. అజ్ఞాత వాసంలో ఉన్న మహరాజులాగా ఆయన ఆచూకి అంతుచిక్కడం లేదు. ఈ మధ్య రవితేజ సన్నిహుతుడు పూరి జగన్నాథ్ మాత్రం కొంతగుట్టు విప్పారు. అదేమంటే రవితేజ ప్రస్తుతం ప్రకృతిని ఆస్వాదించే పనిలో ఉన్నారని, విదేశాలు చుట్టేస్తున్నారని చెప్పారు. టూరిజంపై ఎంతటి మక్కువ ఉన్నా ఏడాది పొడవునా ఎవరూ తిరగరనే విషయం తెలిసిందే. రవితేజ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇదివరకు ఉన్న హుషారు తగ్గిందని, ఆయన కొంత అనారోగ్యంతో బాధపడుతున్నారని ప్రచారం జరుగుతోంది. కొద్ది సంవత్సరాల క్రితం అకస్మాత్తుగా రవితేజ ఒక హాస్పటల్లో చేరి చికిత్స చేయించుకున్నారు. లేట్ వయస్సులో ఫైట్స్, ఛేజ్‌లు చేయడానికి రవితేజ ఆరోగ్యం సహకరించడం లేదనే మాట ఫిల్మ్‌నగర్‌లో షికారు చేస్తోంది. ఈ కారణంగానే రకరకాల కారణాలు చూపుతూ, సినిమాలు క్యాన్సిల్ చేసుకుంటున్నారని అంటున్నారు. ఒక్కో సినిమాకు పది కోట్లు పారితోషికం డిమాండ్ చేసే రవితేజ సుమారు ఏడాదిగా ఖాళీగా ఉంటున్నాడు. ఒక్కో సినిమాకు రెండు నెలలు డేట్స్ కేటాయిస్తూ, ఏడాదిలో రెండు, మూడు సినిమాలు చేయడం ఆయన పద్దతి. ఈ లెక్కన సుమారు 30 కోట్లు నష్టపోయినట్టే. ఇంత నష్టాన్ని డిమాండ్ ఉన్న హీరో ఎందుకు వదిలేశారనేది చాలామందికి డౌట్.