తమిళ్ డైరెక్టర్ మురుగదాస్ అంటే తెలియనివారుండరు. ఆయన తీసిన సినిమాలు అటు తమిళం లోనే కాక ఇటు తెలుగులోనూ ఘన విజయం సాధించాయి. ఇక ఆయనతో సినిమా అంటే హీరోలే కాకుండా హీరోయిన్స్ కూడా చాలా ఆశక్తి చూపిస్తారు. అయినా మురుగదాస్ తాను కోరుకున్న హీరో, హీరోయిన్స్ కి మాత్రమే తన సినిమాల్లో అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఇక కొత్త అమ్మాయిలకు మురుగదాస్ హీరోయిన్స్ గా అవకాశమిచ్చి వారికి మంచి కెరీర్ ని అందించాడు.
అలా అందించిన వారిలో ఆసిన్ ఒకరు. ఆసిన్ ని గజినీ సినిమాలో హీరోయిన్ గా తీసుకుని ఇటు సౌత్ లోనే గాక అటు ఉత్తరాదిలోనూ టాప్ హీరోయిన్ ని చేసాడు. ఇలా చాలామందే వున్నారు ఆయన లిస్ట్ లో. అయితే ఒక హీరోయిన్ మాత్రం కొన్ని కారణాల వల్ల మురుగదాస్ చిత్రంలో మంచి ఛాన్స్ పోగొట్టుకుంది. అదికూడా ఆమెకు తెలియకుండానే ఆ ఛాన్స్ మిస్ అయ్యిందట. ఆమె ఎవరో కాదు ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చెలరేగిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్. అయితే రకుల్ ఇప్పుడు అన్నీ కలిసొచ్చి మురుగదాస్ డైరెక్షన్ లో.... తాను కలలుగన్న హీరో మహేష్ పక్కన హీరోయిన్ గా చేస్తుంది. రకుల్ అసలు ఇంతకుముందే మురుగదాస్ తీసిన తుపాకీ సినిమాలో చెయ్యాల్సి ఉందట. కానీ ఆ అవకాశం రకుల్ కి తెలియకుండా అది మిస్ అయిపోయిందట.
అసలు మురుగదాస్ తాను తుపాకీ చిత్రాన్ని తీసేటప్పుడు హీరోయిన్ కోసం వెతికే వేటలో ఒక యాడ్ లో రకుల్ ని చూసి ఆమెని సంప్రదించడాని కి ఆ యాడ్ ఏజెన్సీని కాంటాక్ట్ చేసాడట. అయితే ఆ యాడెజెన్సీ వారు మాత్రం రకుల్ సినిమాల్లో హీరోయిన్ గా చెయ్యదని చెప్పడం తో మురుగదాస్ కాజల్ ని సెలక్ట్ చేసుకున్నాడట. ఇక తుపాకీ సినిమా తమిళంలో, తెలుగులో పెద్ద హిట్ అయ్యింది. అయితే తర్వాత రకుల్ కి ఈ విషయాలన్నీ తెలియక తాను హీరోయిన్ గా ట్రై చేస్తున్నప్పుడు తాను వివరాలు డైరెక్టర్ మురుగదాస్ కి మెయిల్ చేసిందట. పాపం రకుల్ మంచి ఛాన్స్ ని తనకి తెలియకుండా పోగొట్టుకుందన్నమాట.
ఇక రకుల్ ఛాన్స్ పోగొట్టుకున్న విషయం మాత్రం ఇప్పుడు మహేష్ - రకుల్ జంటగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో మురుగదాస్ రకుల్ కి చెప్పి ఆమెకు పెద్ద షాక్ ఇచ్చాడట. అప్పుడు పోతేనేం ఇప్పుడు స్టార్ హీరో మహేష్ పక్కన మురుగదాస్ డైరెక్షన్ లో హీరోయిన్ గా చేస్తూ తెగ సంతోషపడిపోతుంది రకుల్.