జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనంతపురం ప్రసంగంలో పరిణతి ఉంది. గతంలో పవన్ ప్రసంగించిన విధానం వేరు. అనంతపురం ప్రసంగం వేరు. అసలు వాటికి వీటికి చాలా వైరుధ్యం ఉంది. ఆ ప్రసంగాలలో ఎవరో మాట్లాడిస్తున్నట్లుగా, ఏదో ఒక స్వార్థాన్ని అట్టిపెట్టుకొని సాగినవిగా అనిపించినా అనంతలో సాగిన సుదీర్ఘ ప్రసంగం మాత్రం చాలా పరిణతి వాణిగా ధ్వనిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పవన్ జరిపిన సుదీర్ఘ ప్రసంగంలో చాలా విషయాలను చాలా ఆవేదనగా ప్రస్తావించాడు. జరుగుతున్న అన్యాయాన్ని, జరగబోయే అన్యాయాన్ని తెలియజేశాడు. అసలు సర్వం తెలిసిన జ్ఞానిలా మాటలు వినపడ్డాయి. పవన్ చిన్నప్పుడు తాను చాలా సాధారణమైన విద్యార్ధిని అని చెప్పి ప్రత్యేక హోదా ప్రకటణ అంశాలను చదివి అర్థం చేసుకొనేందుకు కొంతమంది నిపుణులకు పెట్టుకోవాల్సి వచ్చిందని నిజాయితీగా వెల్లడించాడు. అసలు ప్రత్యేక ప్యాకేజీ అంటూ కేంద్రం ప్రకటించిన దాంట్లో ప్రత్యేకం అంటానికిగానీ, ఆ పదం వాడటానికి గానీ తగిన అర్హత కేంద్రానికి ఏమాత్రం లేదన్నాడు. తర్వాత పోలవరం విషయం ప్రస్తావించాడు. అందులో కేంద్ర ఇస్తున్న నిధులెంత అన్నది చెప్పి అందులో జరిగిన మోసాన్ని తేటతెల్లపరిచాడు.
పవన్ ప్రసంగంలో ముఖ్యంగా రాజకీయ అవగాహన కంటే సామాజిక అవగాహన ఎక్కువగా ధ్వనించింది. సమాజం పట్ల బాధ్యత గల పౌరుడిగా ప్రతి ఒక్కడూ జరుగుతున్న తంతును, రాజకీయ నాయకులు చేస్తున్న అంతర్గత రహస్యాలను కూడా తెేటతెల్లపరిచాడు. అంటే కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ అంటూ చేసిన మోసాన్ని, అసలేమిచ్చారు అన్నది కూడా ఇంతవరకు మన రాజకీయ నాయకులకు అర్థం కాలేదు? అర్థం చేసుకోడానికి ప్రయత్నించ లేదా?. అదంతా మాకెందుకులే అన్నట్లు వ్యవహరించారా? అన్నది అంతుపట్టని మిస్టరీగా మారిందన్న విషయాన్ని విప్పిచెప్పడంతో పవన్ చెప్పకనే చెప్పినట్లయింది.
పవన్ ఒక విషయం మీద అధ్యయనం చేసేప్పుడు దాని గురించి సమగ్రంగా పూర్వాపరాలను తెలుసుకునేలా ఆయన రాయలసీమ అయిన అనంతపురం జిల్లా పట్ల ఉన్న వ్యక్తీకరించిన భావాల ద్వారా అర్థమౌతుంది. కరువు, తాగటానికి నీరు కూడా లేని అక్కడి ప్రాంతాలు, ప్రజానాయకులంతా కలిసి పోరాడాల్సిన అవసరం వీటన్నింటి గురించి ఓ విప్లవ నాయకుడిలా సమాజావగాహనతో మాట్లాడాడు పవన్. ఇంకా అమరావతి రాజధాని విషయంలో కూడా చాలా ముందు చూపుతో భవిష్యత్తరాలకు అనుగుణంగా నిర్మించాలని, సింగపూర్ పాలకుడు లీక్ వాన్ యూ నిజాయితీ గురించి తెలిపాడు. ఇలా ప్రతి విషయంలోనూ పవన్ గుండె రగిలేలా ప్రజలను తన ప్రసంగం ద్వారా ప్రభావితం చేశాడు. ఇంకా సహజవనరులను ఉపయోగించుకోవాలని చెప్పాడు. అన్ని వర్గాలకు, అన్నిచోట్లా సమాన అవకాశాలు ఉండి, సమసమాజ నిర్మాణం జరగాలని ఆకాంక్షించాడు. మొత్తానికి పవన్ పరిణతి చెందాడు. పవన్ ను చూసి నేర్చుకోవాల్సిన నాయకులు చాలా మందే ఉన్నారు. ఎప్పుడూ పాడిందే పాడరా పాచిపళ్ల దాచరా అన్నట్లు ఊకదంపుడు ఉపన్యాసాలకు సెలవ్ చెప్పాలంటే రాజకీయ, సామాజిక పరిణతి అవసరం అన్నది దీన్ని బట్టి ముఖ్యంగా నాయకులకు అర్థం చేసుకొనేలా చెప్పడం నిన్నటి పవన్ నైజం అయింది. అసలు పవన్ అనంతపురం ప్రసంగం అంతా ప్రజలకు చెప్పలేదు నాయకులకు హిత బోధ చేశాడు. గుర్తెరిగి మలుచుకోమన్నాడు. అలా అయితేనే రాజకీయాలు చేయమన్నాడు. లేకపోతే తన జనసేన దూకుతుంది అన్నాడు. అదన్నమాట.