జనసేనాధిపతి పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. గురువారం రాయలసీమలోని అనంతపురంలో నిర్వహించిన సభకు యువత భారీగా హాజరైంది. అనంతలో పార్టీ కార్యాలయం ప్రారంభిస్తానని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. తెదేపాకు అనంతపురం కంచుకోట గత 2014 ఎన్నికల్లో 14 శాసనసభ నియోజకవర్గాల్లో 12 గెలుచుకుంది. రెండు పార్లమెంట్ స్థానాలు సైతం తెదేపావే. ఇదే జిల్లాలో నటసింహం బాలకృష్ణ హిందుపురం నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇలాంటి కంచుకోటలో పవన్ అడుగుపెట్టడం వ్యూహాత్మకమే అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. బాలయ్యను తద్వారా చంద్రబాబుకు పవన్ సవాల్ విసిరారని అంటున్నారు. వెండితెరపై ప్రత్యర్థులను వెంటపడి తరిమే బాలయ్య రాజకీయ ప్రత్యర్థిని ఎలా ఎదుర్కొంటారు? అనేది అభిమానుల్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు తన నియోజకవర్గం ఉన్న జిల్లాను కాపాడుకోవాల్సిన భారం బాలకృష్ణపై పడింది. సినిమాల ధ్యాసలో నియోజకవర్గానికి అందుబాటులో లేరనే విమర్శలు బాలయ్యపై ఉన్నాయి. మారిన సమీకరణల నేపథ్యంలో ఇక నుండి దృష్టి సారించకతప్పదు. పైగా పవన్ ను ఎదుర్కోవడానికి, పార్టీని బలోపేతం చేయడానికి మార్గాలు అన్వేషించాలి. పవన్ అసెంబ్లీకి పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. ఆ పోటీ అనేది అనంత జిల్లా నుండే అయితే మాత్రం బాలయ్యకు రాజకీయ కష్టాలు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.