తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా బాధపడ్డారు. పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్ర ఆదాయానికి గండిపడిందని గవర్నర్ కు తెలిపారు. ప్రభుత్వ ఆదాయం తగ్గింది సరే, మరి ప్రజలకు జరిగిన నష్టం గురించి ఆయన ఆలోచించలేదు. ఒక్క మాట మాట్లాడ లేదు. రాష్ట్ర ప్రజల బాగోగులు చూడాల్సిన ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వ ఆదాయం గురించి ఆవేదన చెందుతున్నారు. కానీ పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలకు జరిగిన, జరుగుతున్ననష్టం గురించి మరిచారు. ప్రభుత్వ ఆదాయం తగ్గేది తాత్కాలికమే, కానీ ప్రజలకు జరిగింది మాత్రం అపారనష్టం. చిరుద్యోగులు, చిరు వ్యాపారులు దీనివల్ల తీవ్ర ఇబ్బందులు చవిచూస్తున్నారు. చిల్లర కోసం వీధినపడ్డారు. వారికి ధైర్యం చెప్పాలి, ప్రభుత్వ చెల్లింపులు పాత నోట్లతో జరుపుకునే అవకాశం కల్పించాలి. కానీ ఇలాంటి భరోసా ఇవ్వలేదు. కరెన్సీ అనేది కేంద్రప్రభుత్వానికి సంబంధించింది కావడం వల్ల ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదన్నట్టుగా భావిస్తున్నట్టుంది.