తెలుగు మీడియా పవన్ కల్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ కే పరిమితం చేశాయా? అంటే అవుననే జనసేన అభిమానులు భావిస్తున్నారు. అనంతపురంలో జరిగిన సభ కవరేజ్ను తెలుగు దిన పత్రికలు ఆంధ్ర ఎడిషన్స్ లో మాత్రమే ప్రముఖంగా ప్రచురించాయి. తెలంగాణ ఎడిషన్స్ లో లోపలి పేజిల్లో ప్రాధాన్యతలేని వార్తగా ఇచ్చాయి. ఈ తేడా వల్ల మీడియా ఉద్దేశం ఏమిటనేది తెలిసింది. పవన్ కల్యాణ్ ను కేవలం ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తిగానే అవి భావిస్తున్నట్టు స్పష్టమైంది. అంటే జనసేనా కూడా ఆంధ్రాపార్టీగానే అవి భావిస్తున్నాయన్నమాట. నిజానికి పవన్ కు రెండు రాష్ట్రాల్లో అభిమానులున్నారు. అయినప్పటికీ మీడియా ఈ వ్యత్యాసం చూపడం గమనార్హం. నిజానికి మీడియాకు ప్రాంతాలు, కులాలు ఉండకూడదు. కానీ పవన్ విషయంలో జరుగుతున్నది వేరు. ప్రజల్లో లేనిపోని అపోహలు కల్పించడం వల్ల గందరగోళం ఏర్పడుతుంది. ఇప్పటికే మన దినపత్రికలు ఒక్కో పార్టీకి కొమ్ముకాస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు పాపులారిటీ ఉన్న వ్యక్తులను కూడా ఒక ప్రాంతానికే పరిమితం చేయడం సబబు అనిపించుకోదు. ఈ తీరుపై పవన్ అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.