జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనంతపురంలో సీమాంధ్ర హక్కుల చైతన్య సభ అంటూ బారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఎంతో భావావేశంతో ప్రసంగించాడు. ప్రధానంగా అనంతపురం సమస్యలపై సాగిన ఆయన ప్రసంగంలో అనేక సమస్యలపై ఏకరువు పెట్టాడు గానీ ప్రత్యేక హోదా కోసం తాను ఏ విధంగా ముందుకు వెళ్తునన్నది మాత్రం వెల్లడించలేదు. 2014లో తాను ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చానని ప్రధానంగా తాను సమస్యలపై పోరాడే వ్యక్తినే గానీ, పారిపోయే వ్యక్తినైతే ఏమాత్రం కాదని పవన్ వెల్లడించాడు. ప్రసంగం మొదట్లో తాను భారత్ జవాన్లపై పాకిస్తాన్ జరిపిన దాడిలో వీరమరణం పొందిన జవాన్ల ఆత్మశాంతి కోసం కొంత సమయం మౌనం పాటించాడు. ఆ తర్వాత పవన్ మాట్లాడుతూ....అనంతపురం అంటే తనకు బాగా ఇష్టమని, రాష్ట్రంలో అనంతపురం అత్యంత వెనకబడిన జిల్లాగా ఆయన పేర్కొన్నాడు.
ముఖ్యంగా భారత్ మాతాకీ జై అంటూ ప్రారంభించిన ప్రసంగంలో.. పవన్ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానని చెప్పి, ప్రత్యేక ప్యాకేజీ నివేదికను నిపుణుల ద్వారా తాను అధ్యయనం చేసి అర్థం చేసుకున్న అంశాలను సవిస్తరంగా వెల్లడించాడు. ఆ అధ్యయనం ద్వారా పవన్ ఏం తెలుసుకున్నాడో వెల్లడించాడు. ప్యాకేజీ సంపూర్ణంగా అర్థం చేసుకున్న పవన్ కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ అంటూ ముసుగు కప్పి ప్రకటించింది తప్ప అందులో రావాల్సిన దానికన్నా ప్రత్యేకంగా ప్రకటించింది ఇసుమంత కూడా లేదని తెలుసుకున్నానన్నాడు. ఇంకా ప్రత్యేక ప్యాకేజీ అంటూ ప్రకటించిన కేంద్రప్రభుత్వానికి మద్దతుగా రాష్ట్ర ఎంపీలు, చంద్రబాబు నాయుడు ఎలా స్వాగతించారంటూ మండిపడ్డాడు. ఇటువంటి ప్యాకేజీ విషయంలో తామేదో ఘనత సాధించినట్లుగా మన నాయకులు సన్మానాలు కూడా చేయించుకున్నారంటూ విరుచుకు పడ్డాడు. ఇంకా ఆ నాయకులు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయంగా పేర్కొనడం చాలా దారుణమంటూ మాట్లాడారు. కాగా కరువు కోరల్లో చిక్కుకున్న అనంతపురం అమృతపు చుక్క అంటూ ప్రత్యేక హోదాను గాలికి వదిలేసిన మన నాయకుల తీరును ఎండగట్టాడు పవన్.
ఇంకా తాను కుటుంబాన్ని పక్కనబెట్టి గత ఎన్నికల్లో తెదేపా- భాజపాకు మద్దతుగా ప్రచారం చేశానని అలాంటిది అన్యాయం చేస్తుంటే, ప్రజలను పక్కనబెట్టి కళ్ళు నెత్తికెక్కినట్లుగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోనంటూ వెల్లడించాడు పవన్. ఇంకా కేంద్రం వైఖరిని దుయ్యబట్టాడు. ఇంట్లో ఆలికి అన్నం బెట్టి ఊరందరికీ ఉపకారం చేసినట్లు కేంద్రం వ్యవహరిస్తుందంటూ పవన్ విరుచుకు పడ్డాడు. కేంద్రం అనంతపురానికి కేంద్ర విశ్వవిద్యాలయం ప్రకటిస్తానని చెప్పింది అది ఇంకా ఆచరణలోకి రాలేదు. ఎప్పుడు ప్రకటిస్తుంది.. 14 ఏళ్ళ పిల్లవాడు వాడి మనవడు చదువుకోడానికా..? అంతకాలం పడుతుందా..? ఇంకా అనంతపురానికి రాసుకోడానికి చరిత్ర ఉంది గానీ గుక్కెడు నీళ్ళు దొరకవంటూ వెల్లడించాడు. కాగా అమరావతి రాజధానిగా సామాన్యుడు నివసించేలా ఉండాలి గానీ, కార్పోరేట్ రాజధానిగా మారకూడదని తెదేపాను హెచ్చరించాడు. ఈ అనంతపురం సాక్షిగా పవన్ ప్రసంగించిన తీరు చూస్తే అంతా కూడాను సమస్యలను ఏకరువు పెట్టడానికే పరిమితం చేసి తాను 2017లో జనసేన పార్టీ మొదటి ఆఫీసును అనంతపురం నుండే ప్రారంభిస్తానంటూ వెల్లడించాడు. రాయలసీమను కరువు దుర్భిక్షం నుండి కాపాడేందుకు ప్రతి నాయకుడూ పూనుకోవాలని కోరాడు..