వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150', బాలయ్య నటిస్తున్న వందో చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నాయి. దాదాపు 13ఏళ్ల తర్వాత సంక్రాంతి రేసులో చిరు, బాలయ్యలు పోటీ పడనుండటం విశేషం. 'అంజి, లక్ష్మీనరసింహ' చిత్రాల తర్వాత ఈ పోటీ మరోసారి రిపీట్ అవుతోంది. కాగా ఈ రెండు చిత్రాలపై వారి అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. వీటికోసం చిరు, బాలయ్యల అభిమానులు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో పూజలు సైతం చేస్తున్నారు. ఇక సెంటిమెంట్‌ను బలంగా నమ్మే బాలయ్య అయితే ఆయన తన కుటుంబసభ్యులతో కలిసికట్టుగా పూజలు, వ్రతాలు, హోమాలు చేస్తున్నాడు. కాగా ఈ రెండు చిత్రాలు సంక్రాంతి కానుకగానే వస్తున్నప్పటికీ వీటి రిలీజ్ డేట్స్ విషయంలో ఒకరోజు ముందు, వెనుక విడుదల కానున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్‌హీరోల చిత్రాల మొదటి రోజు కలెక్షన్లు బాలీవుడ్‌కు పోటీగా అన్నట్లు 30కోట్లు దాటుతున్నాయి. దీంతో ఈ రెండు చిత్రాలలో మొదటిరోజు విడుదలయ్యే చిత్రం ఏకమొత్తంగా గుత్తాధిపత్యం సాధించి రెండో చిత్రం కంటే ఎక్కువ కలెక్షన్లు నమోదు చేసే అవకాశం ఉంది. దీంతో ఎవరు జనవరి 11న రావాలి, ఎవరు జనవరి 12 లేదా 13న రావాలి అనే విషయం మాత్రం తేలడం లేదు. ఈ రెండు చిత్రాల రిలీజ్ డేట్ విషయంలో ఇద్దరు నిర్మాతలు గట్టిపట్టుదలతో ఉన్నారు. ఆల్‌రెడీ 'ఖైదీ నెంబర్ 150' చిత్రాన్ని ఒక రోజు ముందుగా రిలీజ్ చేస్తానని, కాబట్టి అన్ని ఏరియాల్లో థియేటర్లను బ్లాక్ చేయమని ఈ చిత్ర నిర్మాత, చిరు తనయుడు రామ్‌చరణ్ తన డిస్ట్రిబ్యూటర్లకు అల్టిమేటం జారీ చేశాడనే ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు జనవరి 14న శర్వానంద్ 'శతమానం భవతి' చిత్రం కూడా విడుదల కానుంది.