జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా రాయలసీమలోని అనంతపురంలో బహిరంగ సభ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పవన్ కల్యాణ్, ప్రత్యేక హోదా సాధన కోసం ప్రజలను చైతన్య పరిచే నిమిత్తం పెద్ద ఎత్తున సభల ద్వారా ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఆ సభకు 'సీమాంధ్ర హక్కుల చైతన్య సభ' అని పేరు పెట్టి, అందుకోసం ఓ పాటను కూడా రూపొందించారు. జనసేన పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళే నిమిత్తం, ఇలాంటి ఉద్యమం ఈ పార్టీకి మంచి వాహికగా ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకోసం పాటలు కూడా ప్రచారానికి మంచి ఊపునిస్తాయి. వారిలో మరింత చైతన్యాన్ని రగిలిస్తాయి కూడాను. అసలు ఉద్యమాలకు, వీటి ద్వారా ప్రజల్లో మరింత పాపులర్ అయ్యేందుకు పాటలు ప్రధాన భూమిక వహిస్తాయన్నది జగమెరిగిన సత్యం.
కాగా పవన్ ప్రత్యేకంగా ఈ పాటను కోరుకొని రాయించుకున్నట్లుగా తెలుస్తుంది. సేనా జనసేనా.. ‘ప్రజల గుండె రగిలెనురా.. పవనన్నకదిలెనురా’ అంటూ సాగుతుంది ఈ స్పెషల్ సాంగ్. పవన్ కళ్యాణ్ సమక్షంలో విడుదల అయిన ఈ పాటను బద్రీనాయుడు రాయగా ఎమ్మెస్ వాసు పాడారు. ఈ పాటను వింటుంటే ఓ విప్లవంలా ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చేలా అనిపిస్తుంది. పక్కా ప్లాన్ తో వెళ్తున్న పవన్ ఈ సారి తన గళాన్ని ఎలా సంధించనున్నాడో చూడాలి.