ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు జాగర్లమూడి క్రిష్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి. నందమూరి బాలకృష్ణ 100వ చిత్రంగా ఆయన కెరీర్‌లోనే గొప్ప విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. చకచకా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఈ చిత్రం ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకొంటుంది. కాగా హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్ర ప్రారంభోత్సవంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ శాతకర్ణి చిత్రాన్ని ముందుగా తాము చూడాలన్న ఆకాంక్షను వెల్లడించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ జరగనుంది.
అయితే తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి శాతకర్ణి స్పెషల్ షోను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకేసారి చూసేందుకు ప్రత్యేక షో వేయాలని చిత్రం యూనిట్ నిర్ణయించుకుంది. ఆ దిశగా తగిన ముహూర్తాన్ని కూడా ఖరారు చేసేశారు. 2017 జనవరి 3వ తేదీన కేసీఆర్, చంద్రబాబులకు గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రులతో వ్యవహారం కాబట్టి వారి అనుకూల సమయాన్ని బట్టి ఈ డేట్ కు ఫిక్స్ అయిపోయినట్లు సమాచారం అందుతుంది. బాలకష్ణ స్వయంగా మంచి ముహూర్తాన్ని చూసుకొని జనవరి 3వ తేదీనే ప్రత్యేక షో వేయడానికి డిసైట్ అయినట్లు టాక్ నడుస్తుంది. వీలును బట్టి ఇద్దరు సీఎంలకు ఒకేసారిగానీ, వేర్వేరుగా గానీ చిత్రాన్ని ప్రదర్శించాలని భావించినట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ బాలకృష్ణ శైలిలోనే ఆయన తగినట్లుగా ముహూర్తాలు ఫిక్స్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇంకా చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఎక్కడ నిర్వహించాలన్నదానిపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ఈ ఫంక్షన్ విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలలో ఏదో ఒక చోట నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. కానీ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ మాత్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తారని టాక్.