ప్రత్యేక హోదాపై ఉద్యమం మళ్ళీ రగుల్కొంటుంది. తెలుగు ప్రజలను రెండు రాష్ట్రాలుగా విభజించే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత కేంద్రప్రభుత్వం మాటమార్చి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. గత సాధారణ ఎన్నికల్లో అన్ని పార్టీలు కూడాను ప్రత్యేక హాదా ఆంధ్రుల హక్కు అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేసి పబ్బం గడుపుకొని అధికారాన్ని చేపట్టాక దాని ఊసే ఎత్తకుండా హోదాని పక్కదారి పట్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆంధ్రాలో అధికారం చేపట్టిన తెదేపానే ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటణతో ఊసెత్తకుండా పోయింది. ఇంకా హోదాపై గళం విప్పేవారిని గొంతు నొక్కే ప్రయత్నాలు తెదేపా చేతనైనంత వరకు అదుపు చేస్తున్న విషయం తెలిసిందే.
విభజన సమయంలో పార్లమెంటు సాక్షిగా ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అంటూ చెప్పిన పార్టీలు, నాయకులు అధికారాన్ని చేపట్టాక హోదాని మరచి, సమాజాభివృద్ధిని మరచి ఎవరి ప్రయోజనాలను వాళ్ళు చూసుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. విభజన జరిపే సందర్భంలో పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా అని వెల్లడిస్తే.. నో నో పదేళ్లు కావాలంటూ అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న నేత వెంకయ్యనాయుడు గళం విప్పిన విషయం తెలిసిందే. అలాంటి నేత ఇప్పుడు మాట మారుస్తూ ఆంధ్రాకి ప్రత్యేక హోదా అసలు ఏ ప్రాతిపదికపై వస్తుంది అంటూ వెల్లడించడం విడ్డూరంగా ఉంది.
ఇక చంద్రబాబునాయుడు అయితే ఏకంగా ఆంధ్రాకి 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలంటూ ఎన్నికల ప్రచార సభల్లో ప్రస్తావించిన విషయం తెలిసిందే. అలాంటి నేత ఇప్పుడు ఆంధ్రాకి అసలు ప్రత్యేక హోదా ఏం సంజీవిని కాదంటూ వెల్లడించడం చాలా ఆలోచనకు దారితీసేలా ఉంది.
అయితే ప్రజలు ఇప్పుడు కేంద్రప్రభుత్వం ఇచ్చిన మాటపై నిలబడి ప్రత్యేక హోదా తప్పకుండా ఇచ్చితీరాలంటూ మదిలో పెట్టుకుంటున్నారు. ఆంధ్రాకి హోదా వస్తే పరిశ్రమలకు అనేక రాయితీలు వస్తాయంటూ బలమైన నమ్మకంతో ఉన్నారు ప్రజలు. ఇంకా ఆదాయపు పన్ను, అమ్మకం పన్ను, ఎక్సైజ్ సుంకాల్లో రాయితీలు, అంతేకాకుండా తక్కువ వడ్డీకే రుణాలు, రవాణా వ్యయాన్ని ప్రభుత్వమే భరించడం వంటి అనేక ప్రయోజనాలు కూడా కలుగుతాయని ప్రజల విశ్వాసం. పరిశ్రమలు ఏర్పడితే యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది ప్రజల విశ్వాసం. అందుకోసం ప్రత్యేక హోదా ఇచ్చితీరాలంటూ ప్రజలంతా నినదిస్తున్నారు. ప్రత్యేక హోదాను తమ హక్కుగా భావించిన ప్రజలు దాన్ని సాధించడం కోసం నిరంతరం నాయకుల తోడుగా పోరాడుతూనే ఉంటామంటున్నారు. అందులో భాగంగానే విశాఖపట్నంలో ‘జై ఆంధ్రప్రదేశ్’ అంటూ వైకాపా ప్రత్యేక హోదా కోసం గళం విప్పనుంది. మరో పక్క జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ నెల 10వ తేది అనంతపురంలో ప్రత్యేక హోదాకోసం భారీ సభను నిర్వహించి ప్రజలను చైతన్య పరిచే ఉద్దేశంలో ఉన్నారు. ఇలా ఆంధ్రాలో ప్రత్యేక గళం మళ్ళీ రాజుకుంటున్నట్లుగానే పరిస్థితులను బట్టి తెలుస్తుంది.