ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రతిపక్ష నేతగా 'ప్రత్యేక హోదా' కోసం పోరాడుతున్నాడు. కాగా ఆయన రక్షణకు చంద్రబాబు ప్రభుత్వం సైతం కొంతమంది పోలీసులను ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఇచ్చిన భద్రతపై జగన్ సంతృప్తిగా లేరనే వార్తలు వస్తున్నాయి. ఆయన తన భద్రత కోసం తానే స్వయంగా 150మంది బౌన్సర్లను ఏర్పాటు చేసుకొని వారికి తానే సర్వ ఖర్చులు భరిస్తున్నాడు. కాగా జగన్‌కు మొదటి నుండి విజయవాడను రాజధాని చేయడం ఇష్టం లేదు. అక్కడ కుల పోరు ఎక్కువ. వారిలోనూ ఐక్యత ఉండదు. కులాధిపత్యం కోసం ప్రత్యర్దులను ఎంతో ఈజీగా ప్రాణాలు తీయడానికి వెనుకాడరు. అదే ఉద్దేశ్యంతోనే జగన్ రాజధానిగా విజయవాడను వ్యతిరేకిస్తూ వచ్చారు. కాగా ప్రస్తుతం విజయవాడకు దగ్గరలోని గుంటూరు జిల్లా వెలగపూడిలోనే రాజధానిని, సచివాలయాలను నిర్మించిన తెదేపా ప్రభుత్వం మొత్తం మీద జగన్‌ను మరింత భయపెడుతూ విజయవాడకు కూసమెత్తు దూరంలో ఉన్న వెలగపూడిలో అన్నీ నిర్మిస్తోంది. కాబట్టి ప్రతిపక్ష పార్టీ అయిన తమకు సొంత కార్యాలయ భవనానికి సైతం అక్కడే ఇవ్వనుంది. దీంతో జగన్ భయపడుతున్నాడు. ఆయన గుంటూరు జిల్లాలోనే పార్టీ తాత్కాలిక కార్యాలయాన్ని, తన నివాసాన్ని కూడా వెలగపూడి సమీపంలో ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అధికార టిడిపి నాయకులకు భయపడి ఆయనకు కార్యాలయం కోసం, లేదా తన నివాసం కోసం అద్దెకు ఇవ్వడానికి ఎవ్వరు ముందుకు రావడం లేదు. ఇక జగన్‌కు సన్నిహితుడైన బాలాజీరెడ్డి జగన్‌కు అనువైన స్థలాన్ని రెడ్డిపాళెంలో అద్దెకు ఇవ్వడానికి రెడీ అయ్యాడు. కానీ మరీ దూరంగా ఉండటం, భద్రతారీత్యా, వాస్తు రీత్యా కూడా మంచి ప్రదేశం కాదని కొందరు వారించారు. ఇక తాజాగా సినీ సూపర్‌స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావుకు చెందిన ఉండవల్లిలోని తమ స్థలాన్ని జగన్‌కు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జగన్‌కు కాస్త ఊరటనిస్తోందని అంటున్నారు.