పవన్ తన ఓటును ఏలూరు కు మార్చుకోరడం, జెడీ లక్ష్మీనారాయణ్‌తో సమావేశం వంటి వార్తల వల్ల ప్రస్తుతానికి వైసీపీ, రాష్ట్ర బిజెపిలలో కలకలం మొదలయింది. తన తండ్రి హయాంలో పలు ఆర్దిక నేరాలకు పాల్పడిన జగన్‌తో భవిష్యత్తులో కూడా కలవడానికి పవన్ సుముఖంగా లేడని స్పష్టమవుతోంది. రాబోయే ఎన్నికలలో మరలా వైసీపీని పక్కనెట్టి పోటీ మొత్తం తెలుగుదేశం పార్టీ, జనసేనల మద్యే ఉండేలా ద్విపక్ష ఎన్నికలు జరిగేలా పవన్ ప్లాన్ చేసుకుంటున్నాడు. అందులో భాగంగానే ఆయన వైసీపీని అసలు పట్టించుకోవడం లేదు. మరోపక్క పవన్ ప్రస్తుతం వైసీపీకే కాకుండా అధికార టిడిపి, దాని మిత్రపక్షం, కేంద్రంలోని ఎన్డీఏలకు ఎర్త్ పెడుతున్నాడు. ఆయన వచ్చే ఎన్నికల్లో టిడిపి- బిజెపి కూటమి కలిసి ఎన్నికల్లో నిలబడితే దానికి పోటీగా వామపక్షాల మద్దతుతో ఆయన ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఏపీకి ఎట్టిపరిస్దితుల్లోనూ ప్రత్యేకహోదా ఇవ్వలేమని, కొన్ని సాంకేతిక కారణాలు దానికి కారణమని బిజెపి నాయకులు కాకినాడలో నెత్తి నోరు బాదుకున్నారు. కానీ టిడిపితో పాటు బిజెపిని కూడా వైరిపక్షంగా భావిస్తోన్న పవన్ ప్రత్యేకహోదాపై తిరుపతి, కాకినాడ తర్వాత నవంబర్ 10న అనంతపురంలో సభ పెడుతున్నాడు.ఈ సభలో ఆయన ఏం మాట్లాడుతాడు? అనేది ఆసక్తికరంగా మారింది.
పవన్ ప్రత్యేకహోదాపై చేసే ప్రసంగాలలో ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకుండా మాటతప్పిన బిజెపిని టార్గెట్ చేసినట్లుగా, కేంద్రానికి తలలు ఊపి మద్దతిచ్చిన టిడిపిని పవన్ పెద్దగా పట్టించుకోవడం లేదు. కాగా వచ్చే ఎన్నికల్లో ఎన్ని ఎవరనుకున్నా ద్విపక్ష కూటమిగా ఎన్నికలు జరిగే అవకాశం లేదని, వైసీపీ కూడా వచ్చే ఎన్నికల్లో అధికారానికిి పోటీపడనుందనేది వాస్తవం. అలా త్రిముఖ పోటీ జరిగిన పక్షంలో చంద్రబాబు టిడిపి- వెంకయ్యనాయుడు బిజెపిల కూటమికి జనసేనతో పాటు వైసీపీ కూడా పెద్ద పోటీ ఇవ్వనుంది. ఈ త్రిముఖ పోటీలో చంద్రబాబు టిడిపి కంటే అధికారపక్ష వ్యతిరేకత ఓట్లు తమకు గుంపగుత్తగా పడుతాయని వైసీపీ భావిస్తూ వస్తోంది. కానీ ఈ రాజకీయ పరిణామాలు జరిగితే అధికార పక్ష వ్యతిరేక ఓట్లు వైసీపీకి, జనసేనకు మద్య చీలిపోయి చివరకు బొటాబొటి మెజార్టీతో చంద్రబాబు అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది. ఇంతకాలం చంద్రబాబు కోరుకుంటున్నది కూడా అదే. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తేనే మేలని బాబు భావిస్తూ వస్తున్నాడు. మరి ఆయన వ్యూహం ఫలించినట్టేనా? పవన్ పోటీలో దిగుతాడా? అనే అంశాలపై రాజకీయవర్గాలన్నింటిలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది.