జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవసరమనుకుంటే పూర్తి స్థాయి రాజకీయవేత్తగా మారుతానని తెలిపిన విషయం తెలిసిందే. అక్కడ నుండి పవన్ అడుగులు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అప్పటి నుండే పవన్ గురించి చర్చోపచర్చలు చేస్తున్నారు రాజకీయవేత్తలు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాపై పోరాడతానని అందుకోసం ఇప్పటికే రెండు సభలు పెట్టి మరీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ సభలలో పవన్ కళ్యాణ్ కేవలం భాజపానే లక్ష్యంగా చేసుకొని, భాజపా నాయకులను, తెదేపా ఎంపీలను, భాజపా ఎంపీలను విమర్శిస్తూ ప్రసంగాలను కొనసాగించిన విషయం తెలిసిందే. కాగా భాజపా అందుకు ప్రతిస్పందనగా పవన్ పై ఆరోపణలు చేయడం, పవన్ ను తాము మద్దతు ఇవ్వమని అడగలేదని, తనే మా వద్దకు వచ్చి కావాలని మద్దతు పలికాడని గత ఎన్నికల్లో అంతవరకే జరిగిందని ప్రత్యారోపణలు చేస్తున్న విషయం కూడా తెలిసిందే. ఈ మధ్య ఇంకాస్త ముందడుగు వేస్తూ పవన్ కళ్యాణ్ తో తమ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవని కూడా వెల్లడించింది. దీంతో పవన్ కి భారతీయ జనతా పార్టీతో సంబంధాల విషయం తెరపడినట్లయింది. ఈ విషయాన్నిఆంధ్రప్రదేశ్ భాజపా ఇన్చార్జి సిద్ధార్థనాథ్ సింగ్ వెల్లడించాడు. దీంతో ఇక పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం పూర్తి స్థాయిలో భాజపాపై విరుచుకు పడటానికి తగినపట్టు దొరికింది. పవన్ కళ్యాణ్ కు ఈ విషయంపై సాధికారికంగా పోరాటాన్ని కొనసాగించడానికి స్వేచ్ఛ లభించినట్టయిందనే చెప్పాలి.
అయితే ఇక్కడ చిక్కొచ్చిందల్లా ఏంటంటే...స్థానికంగా తెదేపాతో ఇంకా బంధాన్ని కొనసాగిస్తున్నట్లుగా కనపడుతుంటడమే. ఏపీకి కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా బదులుగా రెండు పాచీపోయిన లడ్డూలను పడేసినట్లుగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంతో అది తమ ఘనతగా భావిస్తూ తెదేపా తెగ మురిసిపోతుంది. ఈ విషయంలో ప్రత్యేక ప్యాకేజీకే తెదేపా ప్రత్యేక హోదా లభించినంత ఆనందంతో పొంగిపోతూ దాని గురించి ఎవరినీ ఊసెత్తనీకుండా, ప్రత్యేక హోదా కావాలని ఏ ఒక్కరినీ పల్లెత్తి మాట్లాడనీకుండా వ్యవహరిస్తుంది. ఈ మధ్య భాజపా ఏపీ ఇన్చార్జ్ సిద్ధార్ధ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ... అసలు పవన్ మా ఎన్డీఏలోనే లేడని, కేవలం గత ఎన్నికల్లో తమకు మద్దతు మాత్రమే ఇచ్చాడని వెల్లడించడంతో ఇక పవన్ నిజంగా స్వేచ్ఛాజీవి అయిపోయాడు. అయితే గతంలో పవన్ జరిపిన రెండు భారీ బహిరంగ సభల్లో చంద్రబాబుగానీ, వారి పోరాటాన్ని గానీ ఏమాత్రం ప్రస్తావించలేదు సరికదా, ప్రశ్నించను కూడా లేదు. అయితే చంద్రబాబుకు పవన్ అంతర్గతంగా గట్టిగా మద్దుతిస్తుండటంతోనే బాబును ఎలాంటి మాటా పవన్ అనలేకపోతున్నాడని ప్రజాభిప్రాయం. గత ఎన్నికల్లో మద్దతిచ్చిన పవన్ ఈసారి కూడా తెదేపాకి మద్దతివ్వాలని చంద్రబాబు కూడా భావిస్తూ అందుకు పవన్ కళ్యాణ్ తెదేపాను బహిరంగ సభల్లోగానీ, ఎక్కడైనా ఏమని వ్యాఖ్యానించినా తెదేపా తరఫు నుండి మాత్రం ఏ ఒక్కరు స్పందించని విధంగా వారి ధోరణి కొనసాగుతుంది. అంటే దీన్ని బట్టి లోపాయికారిగా పవన్, చంద్రబాబు మధ్య ఏదో జరుగుతుందన్నది మాత్రం వాస్తవంగా అగుపిస్తుంది. కానీ పవన్ అభిమానులు గానీ, పవన్ జనసేన కార్యకర్తలు గానీ పవన్ కళ్యాణ్ నిజంగా ప్రత్యేక హోదాకోసం పోరాడాలన్న సంకల్పం ఉంటే, తెదేపాతో కూడా బంధాన్ని తెంచుకొంటే అప్పుడు స్వేచ్ఛగా ఎటువంటి బంధాలను లెక్కజేయకుండా ప్రసంగించవచ్చన్న గుసగుసలు వినపడుతున్నాయి. ఈ ఒక్క బంధం కారణంగానే పవన్ కళ్యాణ్ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నాడన్న అపవాదు మూటకట్టుకుంటున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం భాజపా నుండి పూర్తి స్వేచ్ఛ, అటు వైకాపా నుండి ఎప్పటి నుంచో స్వేచ్ఛ, ఇక తెదేపా నుండి స్వేచ్ఛను తీసేసుకుంటే పవన్ కళ్యాణ్ ఈ నెల 10వ తేదీన జరిగే అనంతపురంలో అనంతంగా, అమాంతంగా, విశృంఖలంగా ఆయన అనుకున్న, భావిస్తున్న విషయాలన్నీ ముక్కుసూటిగా ప్రసంగించవచ్చునన్నది ప్రజల అభిప్రాయం. మరి చూద్దాం ఏం జరుగుతుందో...