ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. కాగా త్వరలో మంత్రివర్గ విస్తరణ వుంటుందంటూ ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి గానీ, రాను రాను ఆ వార్త పలచబారిపోయేట్టుగానే కనపడుతుంది. అందుకు తగిన ముహూర్తం ఇంకా కుదరకపోవడం చర్చనీయాంశంగా మారుతుంది. ఇప్పుడు చంద్రబాబుకు మంత్రివర్గ విస్తరణ చాలా పెద్ద ప్రమాదంగా పరిణమించింది. ఎవరిని మంత్రి పదవి నుండి తొలగిస్తే ఏ సామాజిక వర్గం నుండి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందోనని బాబు భయపడుతున్నట్లుగానే తెలుస్తుంది. ఆంధ్రాలో కాపు సామాజిక వర్గం కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 16వ తేదీ నుంచి మరోపక్క ముద్రగడ పద్మనాభం మళ్లీ ఉద్యమ బాట పడుతున్నాడు. దీన్ని ఆసరాగా చేసుకొని ఇప్పుడు కాపు వర్గం నుండిగాని మంత్రివర్గం నుండి ఏ ఒక్కరిని తొలగించినా అందుకు తప్పకుండా ప్రతిఘటన ఎదుర్కోవలసి ఉంటుందంటూ చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.
కాగా కాపు సామాజిక వర్గానికి చెందిన ఓ మంత్రితో పార్టీలో బాబు తలనొప్పులు ఎదుర్కొంటున్నప్పటికీ ఇప్పటి పరిస్థితిలో వారిని ఏం అనే పరిస్థితి లేదని కూడా టాక్ నడుస్తుంది. ఇంకా ఆ మంత్రి నిర్వహిస్తున్న శాఖపై అవినీతి ఆరోపణలు కూడా వచ్చినవి. కానీ ప్రస్తుతం నెలకొన్న సామాజిక, రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కాపు ఉద్యమం తీవ్రత దృష్ట్యా కాపులను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమాత్రం టచ్ చేసే అవకాశం లేనట్లుగానే తెలుస్తుంది.