స్టార్ హీరోల సినిమాలంటే ఆ హడావుడే వేరు. ఫస్ట్ లుక్, టీజర్, ఆడియో రిలీజ్ అంటూ హడావుడి చేస్తారు. ఇదంతా సినిమాపై ఆసక్తిని పెంచడానికే. అందుకే భారీ చిత్రాలకు సంబంధించి ప్రతిది వార్తే అవుతుంది. అయితే దీనికి భిన్నంగా ప్లాన్ చేశాడు 'ధృవ' నిర్మాత అల్లు అరవింద్. రామ్ చరణ్ నటిస్తున్న 'ధృవ' ఆడియో వేడుక జరుగుతుందని, దానికి పవన్ కల్యాణ్ హాజరవుతాడని వార్తలు హల్ చెల్ చేశాయి. తీరా చూస్తే అసలు వేడుకే లేదు నేరుగా పాటలు రిలీజ్ చేస్తామని ప్రకటించి ఆశ్చర్యపరిచారు. అల్లు అరవింద్ ఏ పనిచేసినా దానికి వెనుక కచ్చితంగా వ్యూహం ఉంటుంది. ఇటీవల చిరు ఇంట్లో మెగా హీరోలందరూ కలిస్తే పవన్ హాజరుకాలేదు. ఆ కుటుంబానికే దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి పవన్ 'ధృవ' పాటల వేడుకకు రావడం సందేహంగా మారింది. అందువల్ల వివాదం తలెత్తకుండా వేడుకనే క్యాన్స్ ల్ చేశారు. దీనికి బదులుగా 'సరైనోడు' తరహాలో ప్రీ రిలీజ్ వేడుకను ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించే ఆలోచనలో ఉన్నారని సమాచారం.
మరోవైపు చిరంజీవి నటిస్తున్న 'ఖైదీ నంబర్ 150' సినిమా ఆడియో వేడుక నిర్వహించాల్సి ఉంది. అన్నయ్య రీ ఎంట్రీ సినిమా కాబట్టి దీనికి పవన్ హాజరయ్యే అవకాశాలున్నాయని సంబంధికులు అంటున్నారు. ఇంటికే రాని తమ్ముడు ఆడియోకు వస్తాడా? అంటే వచ్చే అవకాశాలున్నాయి. అన్నయ్య కోసం పవన్ ఆ మాత్రం చేయగలడు. ఈ కారణంగానే 'ధృవ' వేడుక నిర్వహించడం లేదనే మాట వినిపిస్తోంది. ' ఖైదీ..'కి పవన్ ప్రమోషన్ కావాలని బయ్యర్లు సైతం కోరుతున్నారట. యూత్ ని ఆకట్టుకోవాలంటే పవన్ మద్దతు కావాలనేది వారి డిమాండ్. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.