బీచ్ లవ్ ఫెస్టివల్ అని ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం తెలిపింది. అయితే ఆ ప్రేమోత్సవంపై ప్రభుత్వం, ప్రతిపక్షాల నుండి గట్టి విమర్శలనే ఎదుర్కొంటుంది. వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ గోవా సంస్కృతిని ఆంధ్రాలో ప్రవేశ పెట్టాలనుకుంటున్న బుద్ధి చంద్రబాబుకు తట్టడం చాలా శోచనీయమని వెల్లడించింది. సంస్కృతి, సంప్రదాయాలను కాలరాయడమే లక్ష్యంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆమె వివరించింది. ఇంకా రోజా మాట్లాడుతూ.. నారావారి నరకాసుర పాలన పోవాలని, ఆంధ్రాలో భవిష్యత్తు తరాలు బాగుండాలంటే ఏపీకి ప్రత్యేకహోదా రావాల్సిందేనంటూ ఆమె వెల్లడించింది.
కాగా వచ్చే యేడాది ప్రేమికుల దినోత్సవాన్ని రాష్ట్రప్రభుత్వం పెద్ద ఉత్సవంలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్న క్రమంలో రోజా ఇలా స్పందించింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మందు, విందు, చిందు వంటి నూతన పోకడలకు, విశృంఖల జీవనానికి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడని ఆమె తెలిపింది. కాగా ప్రభుత్వం కొత్తగా తలపెట్టిన బీచ్ లవ్ ఫెస్టివల్ ను తమ పార్టీ అడ్డుకుంటుందని ఆమె పేర్కొంది. కాగా మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలు ఆడవారి శరీరం అంగాంగ ప్రదర్శనలను ఏర్పాటు చేస్తూ అందుకు ప్రోత్సహించడం ఎంతైనా శోచనీయం అంటూ రోజా విమర్శించింది.