వైకాపాకి కంచుకోట అయిన కడపలో కూడా తెదేపా పాగా వేస్తుంది. అలా కడప గడపలో ఒక్కొక్కరుగా తెదేపాలోకి వస్తున్నారు. కడప జిల్లాలో వైకాపాను దెబ్బతీసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఇంతకముందే జమ్మలమడుగు నియోజక వర్గం నుంచి వైకాపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెదేపాలో చేరిన విషయం తెలిసిందే. ఆదినారాయణ రెడ్డి తెదేపాలో చేరడాన్ని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించినా కూడా బాబు లెక్కచేయకుండా తెదేపాలో చేర్చుకున్నాడు.
కాగా తాజాగా కడప జిల్లాలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఎర్రగుంట్లలో జనచైతన్య యాత్ర సందర్భంగా మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, తాజాగా తెదేపాలో చేరిన ఆదినారాయణ రెడ్డి ఒకే వేదిక పైకి వచ్చారు. ఇది కడప జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు సాధించిన ఘన విజయంగా భావించి తెదేపా శ్రేణులు పండుగ చేసుకుంటున్నారు. వైకాపా నుండి ఆదినారాయణ రెడ్డి తెదేపాలోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు రామసుబ్బారెడ్డి. కానీ బాబు అక్కడ చాలా చాకచక్యంగా వ్యవహరించి, వస్తామన్న వారిని ఏ ఒక్కరినీ వదులుకొనే ఉద్దేశ్యం లేక అదీ కడప జిల్లా నుండి కావడంతో ఓకే అనేసి ఆనందంగా సైకిలెక్కించుకున్నాడు బాబు. అదే సందర్భంలో రామసుబ్బారెడ్డి, వైకాపా నుండి వెళ్ళిన ఆదినారాయణ రెడ్డికి మధ్య గొడవలు తీవ్రంగా ఉండటంతో అది తమకే లాభిస్తుంది అని భావించింది వైకాపా. కానీ ఇప్పుడు అదే అవకాశంగా తెదేపా ఉపయోగించుకొని వైకాపా నేతలను గట్టిగా దెబ్బకొట్టాలని భావించిన చంద్రబాబు అందుకు అనుగణంగా అడుగులు వేస్తున్నాడు. ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిల కలయిక రాజకీయంగా కడప జిల్లాలో తెదేపాకు అనుకూలంగా మలచుకొని లాభించే దిశగా తెదేపా కార్యకర్తలు కూడా మంచి ఊపుమీద ఉన్నారు. కాగా కడప జిల్లా చైతన్య సభలో పాల్గొన్న జిల్లా ఇంచార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగన్ కు ధైర్యం ఉంటే వైకాపా ఎంపీల చేత ఈ క్షణమే రాజీమానా చేయించాలని గట్టిగా డిమాండ్ చేశాడు.